శ్రీరామ నవమికి రామ మందిర నిర్మాణం ప్రారంభం

న్యూఢిల్లీ : నవంబరు 11: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనన్న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రామమందిరం నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రామమందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తి రేపుతుండగా వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా లాంఛనంగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 2న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో రామమందిర నిర్మాణం ప్రారంభమవుతుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూవివాదం కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి బాలరాముడి (రామ్‌ లల్లా విరాజమాన్‌)కి చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ ఏర్పాటయ్యాక వీహెచ్‌పీ రామ జన్మభూమి న్యాస్‌తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్‌పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్‌పైనే దృష్టి కేంద్రీకరించింది.