శ్రీకాకుళం : డిసెంబర్ 4 : గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగంలోని ఉద్దానం మంచినీటి సరఫరా పథకంలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్పించాలని కోరుతూ ఉద్దానం వాటర్ ప్రాజెక్టు వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ కోపరేటివ్ సొసైటీ బృందం మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను కలిసి విజ్ఞప్తి చేసింది. శ్రీకాకుళం రైస్ మిల్లర్స్ భవనంలో మంత్రిని బుధవారం కలిసిన సొసైటీ సభ్యులు తాము 1999 నుంచి ఆర్డబ్ల్యూ ఎస్ నందు పంపు ఆపరేటర్లుగా, వాల్వ్ ఆపరేటర్లుగా ఎలక్ట్రీషియన్, వాచ్ మెన్ గా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నామని ఆరు నెలలకు ఒకసారి జీతం అందుతోందని మొర పెట్టుకున్నారు. ఎనిమిది మండలాలకు మంచినీటి సరఫరా అందించే పనిలో ప్రతిరోజూ కీలక భూమిక పోషిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంత మంది ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారని ఆరా తీశారు. కలెక్టర్ ను కూడా కలసి సమస్యను వివరించాలని చెప్పారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో సొసైటీ అధ్యక్షులు బి. రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎం. ఆనంద్ కుమార్, కార్యదర్శి జే. ఢిల్లేశ్వరరావు, డైరెక్టర్లు పి. మాధవరావు, సభ్యులు బి.రమణమూర్తి, డి.లక్ష్మణరావు పి. జగదీశ్వరరావు, వి.రామకృష్ణ సిహెచ్ కిషోర్, ఎం. ఆనందరావు ఎస్. ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.
మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ లో చేర్చండి