శ్రీకాకుళం : డిశంబరు 15 : అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఓబిఎస్ జంక్షన్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ నివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహా వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. అమరజీవి ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులయ్యారన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1951 అక్టోబరు 19న సాధారణ దీక్షగా ప్రారంభమైందని అన్నారు.చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యారని చెప్పారు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచడం జరిగిందన్నారు. తదనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా 1956 నవంబర్ 1 న హైదరాబాద్ రాజధాని గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సంగతి విదతమేనని అన్నారు. అమరజీవి వంటి జీవితాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమరజీవిలోని మొక్కవోని దీక్ష, పట్టుదల, అంకితభావం, సాధించాలనే తపన గొప్పవని ఈ లక్షణాలు ముఖ్యంగా యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ సౌభాగ్యం కోసం కృషి చేయాలన్నారు. కష్టించేతత్వం నేర్చుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజం బాగుండాలనే తపనతో పని చేయాలని సూచించారు. సామాజిక రుగ్మతలను నివారించుటకు కృషి చేయాలని తద్వారా నిజమైన నివాళులు అర్పించినవారం కాగలమని అన్నారు. స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అమరజీవి వంటి త్యాగాలు మరువలేమని పేర్కొంటూ వారు సాధించి పెట్టిన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను పరిరక్షించుకోవాలని అన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడు :జిల్లా కలెక్టర్