స్థానిక సంస్థల ఎలక్షన్లకు రెడీగా ఉండాలి

కాకినాడ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవ్వాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డివిజన్‌స్థాయి అధికారులు, ఇద్దరు ఎస్పీలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంచాయతీ పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో 1,072 పంచాయతీలు, 62 జడ్పీటీసీ, 1,184 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఈ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయని చెప్పారు. .పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 27న రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి 27న జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో తదుపరి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రణాళికపై సంయుక్త కలెక్టర్‌ -2 రాజకుమారి, డీపీవో నాగేశ్వర్‌నాయక్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఎస్పీలు అద్నాన్‌నయీమ్‌ అస్మి, షిమోషీబాజ్‌పాయ్‌,సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీశ, సబ్‌కలెక్టర్లు మహేశ్‌కుమార్‌, ప్రవీణ్‌ ఆదిత్య, జడ్పీ సీఈవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.