విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌కు దారిపొడవునా కృతజ్ఞత పూర్వక స్వాగతం లభించింది. సీఎం కాన్యాయ్‌పై పూల వర్షం కురిపించారు. బెలూన్లను గాల్లోకి విసిరి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు.ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్‌కేబీచ్‌కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో సీఎంకు థాంక్స్ చెప్పారు. కాన్వాయ్ వాహనంలో ముఖ్యమంత్రి ఎడమవైపున ఉంటారు. దీంతో రోడ్డుకు ఒకవైపున మాత్రమే నిలబడి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధానిగా ప్రతిపాదించిన కొద్ది రోజుల్లోనే విశాఖ అభివృద్ధికి బీజం వేస్తూ ఏకంగా రూ.1285.32 కోట్ల పనులు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకోనున్నాయి. ముఖ్యమంత్రి వెన్నంటే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఉన్నారు. జిల్లా నుంచి సైతం భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు విశాఖ చేరుకున్నారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి నాలుగు బస్సులలో వచ్చిన కార్యకర్తలు జగనన్న కోసం బీచ్ రోడ్డులో ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి రథసారధి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పేందుకు వారంతా మధ్యాహ్నానికే విశాఖ చేరుకున్నారు.
ముఖ్యమంత్రిని పుష్పక వర్షంతో స్వాగతించిన ఉత్తరాంధ్ర ప్రజలు