శ్రీకాకుళం : డిసెంబర్ 10 : ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు తక్షణమే 100 లేదా 112 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చని శ్రీకాకుళం టౌన్ డి.యస్.పి బి.యస్.ఆర్.వి.యస్.యన్.మూర్తి విద్యార్ధులకు హితవు పలికారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద గల వై.యస్.ఆర్.కళ్యాణ మండపంలో మహిళల రక్షణ పోలీసు భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఆడపిల్లలు బయటకు వెళ్లే సమయంలో తమ తల్లితండ్రులకు గాని, బంధువులకు గాని తెలియజేయాలని కోరారు. తద్వారా ఆపద సమయంలో తాము రక్షణ పొందవచ్చని సూచించారు. అలాగే కౌమార దశలోని ఆడపిల్లలు వస్త్రధారణలో తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ సెల్ ఫోన్లను వినియోగిస్తున్నారని వాటి నుండి మంచిని గ్రహించాలే తప్ప చెడువైపునకు అడుగులు వేయరాదన్నారు. యువత చేసే ప్రతీ విషయాన్ని తమ తల్లితండ్రులకుగాని, బంధువులకు వివరించడం ద్వారా మంచి విషయాలు గ్రహించవచ్చన్నారు. మహిళలు, ఆడపిల్లలు నిర్మానుషంగా ఉండే ప్రాంతాల్లో విహరించరాదని, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించవలసివచ్చిన ఎడల సహాయకులను వెంటబెట్టుకొని వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలకు స్వీయరక్షణ అవసరమని, వీటిపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఇందుకు కొన్ని స్వచ్చంధ సంస్థలు అవసరమైన శిక్షణను ఇస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళలు, ఆడపిల్లల రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం 112,రాష్ట్ర ప్రభుత్వం 100 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటుచేయడం జరిగిందని, వీటితో పాటు 181,1090, 1091 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పనిచేస్తుంటాయని చెప్పారు. వీటి ద్వారా ఆపద సమయంలో తక్షణ సహాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ విజయకుమార్ , తల్లితండ్రులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న మహిళలు క్రింది నెంబర్లకు పోన్ చేయండి