శ్రీకాకుళం:డిసెంబర్ 9: స్పందన కార్యక్రమానికి అనూహ్య“స్పందన” లభించింది. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన భవనంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్, సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్ 2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ్ చక్రవర్తి, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్దఎత్తున ఆర్జీదారులు పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గార మండలం బోరవానిపేట గ్రామానికి చెందిన వాన జగదీష్ కుమార్ తన రేషన్ కార్డు ఇన్ ఏక్టివేట్ అయినందున తనకు నెలవారీ రేషన్ సరుకులు సరఫరా కావటం లేదని, తన మానసిక వికలాంగ కుమారినికి పింఛను కూడా ఆగిపోయినదని విన్నవించారు.తన రేషన్ కార్డును ఏక్టివేట్ చేయించి తనకు న్యాయం చేకూర్చాలని కలెక్టర్ కు వినతిని సమర్పించారు. జిల్లా బధిరుల సంఘం కార్యదర్శి జె.సంతోష్, కె.శ్రీనివాసరావు, ఉదయ్ శంకర్ నారాయణ తదితర సభ్యులు, తమకు విభిన్న ప్రతిభావంతులు కోటాలో ఉద్యోగ అవకాశాలు కలిగించాలని కోరారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలను, విద్యా సంస్థలు, గురుకులాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, తాము 12 సం.ల నుండి విధులు నిర్వహిస్తున్నామని, 2017-18 సం.లో త్రిల్ హెల్త్ అండా వెల్ నెస్ మరియు న్యూనెట్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ అనే థర్డ్ పార్టీ వారికి ఆరోగ్య కార్యకర్తల కార్యక్రమాన్ని అప్పగించడం జరిగిందని తెలిపారు. తమకు నెలవారీ జీతభత్యాలను చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ లో ఆదివాసీ ఆరోగ్య కార్యక్రమాని్ని విలీనం చేయాలని డి.శాంతారావు, లక్ష్మి, కె.నాగభూషణ్, కె.సురేష్, కె.అనిత తదితరులు దరఖాస్తును సమర్పించారు. మెప్మా రిసోర్స్ పర్సన్స్ ద్రాక్షాయని, సీతారత్నం, లక్ష్మి, బి.రత్నం తదితరులు, తాము మెప్మాలో గత 10 సం.లుగా స్వయం శక్తి సంఘ రిసోర్సు పర్సన్స్ గా పని చేస్తున్నామని,40 సంవత్సరాలుదాటిన వారిని తొలగించనున్న సర్క్యులర్ వచ్చినందున తమను తొలగిస్తారనే భయంగా వున్నదని తెలిపారు.తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యమంత్రి వర్యులు అందిస్తున్న గౌరవ వేతనాన్ని అందించాలని కోరారు. రణస్థలం నుండి దేశపు తిరుపతి రావు, రెడ్డి విశ్వేశ్వర రావు, లంక ప్రభాకర రావు, ఆదినారాయణ, తదితరులు తమ భూములను రహదారి విస్తరణ నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ ద్వారా తీసుకోవడం జరిగిందని, మూడు సంవత్సరాలు కావస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని, త్వరిత గతిన నష్టపరిహారాన్ని అందించి తమకు న్యాయం చేయాలని అర్జీని సమర్పించారు. నందిగాం మండలం కొత్త అగ్రహారం గ్రామం నుండి పాలతీర్థం వనజాక్షి, తమ పొలం పక్కన దాబా నిర్వహిస్తున్న వారు తమ పొలంలోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు, గాజు పెంకులు చెత్త, చెదారాలను వేసి బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఆమదాలవలస నియోజకవర్గం తాడివలస గ్రామం నుండి సీపాన నారాయణమ్మ, తన భర్త మరణించడంతో పేదరికంలో వున్న తనకు ఒంటరిమహిళ పింఛనును మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తును సమర్పించారు.ఎచ్చెర్ల నుండి నేదుర లక్ష్మమ్మ, తనకు స్వంత స్థలం వున్నందున గృహనిర్మాణ పథకం ద్వారా గృహాన్ని నిర్మించాలని కోరారు. కంచిలి మండలం నుండి యర్ర శకుంతల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోంపేట బ్రాంచ్ లో తనకు రూ.1,30,000 లు సేవింగ్స్ ఖాతాలో వున్నాయని, తనకు తెలియకుండా వేరే వ్యక్తులు తన ఖాతా నుండి రూ.70 వేలు విత్ డ్రా చేసారని తెలిపారు. తాను సోంపేట బ్యాంకులో, విశాఖపట్నం క్రైమ్ బ్రాంచ్ మరియు పోలీసు స్టేషన్ లోను ఫిర్యాదు చేసినా ప్రయోజనం కలుగలేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం నుండి టి.శ్రీనివాస రావు, తనకు పి.ఎం.ఎ.వై. పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని కోరారు. శ్రీకాకుళం నుండి జి.సరోజిని తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని కోరారు. దివ్యాంగులకు 6 మందికి ట్రై సైకిల్స్ ఇద్దరికి వీల్ చైర్స్ జిల్లా కలెక్టర్ పంపిణి చేశారు.
స్పందనకు అనూహ్య "స్పందన"