శ్రీకాకుళం : డిశంబరు 11 : రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించడానికే ధాన్యం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు.బుధవారం సివిల్ సప్లైస్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, కంట్రోల్ రూమ్ ద్వారా రైతులు తమకు దగ్గరలో వుండే ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలను, వివిధ రకాల ధాన్యం ధరల వివరాలు తెలుసుకోవచ్చునన్నారు.అదే విధంగా తమ సమస్యలపై సందేహాలను తెలుసుకోవడానికి సహాయ పడుతుందన్నారు. ఈ కేంద్రంలో ప్రతి రోజు వచ్చిన ఫిర్యాదుల వివరాలను ఒక రిజిస్టర్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులు కంట్రోల్ రూమ్ నెం.08942 226526 నెంబరుకు ఫోన్ చేసి వారికి అవసరమైన వివరాలను తెలుసుకోవచ్చునని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు.ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, రైతులు సద్వినియోగ పరచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి సివిల్ సప్లైస్ జిల్లా మేనేజరు ఎ.కృష్ణారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి జి.నాగేశ్వర రావు, సి.ఎస్. డి.టి.లు, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు హాజరైనారు.
రైతుల వెసులుబాటు కోసమే కంట్రోల్ రూమ్ ప్రారంభం