రైతులకు మేలు జరిగేలా కల్లాలలోనే ధాన్యం కొనుగోలు

శ్రీకాకుళం : డిసెంబర్ 12 : రైతులకు సంబంధించిన ధాన్యాన్ని తమ కల్లాల వద్దే కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎక్కడకీ వెళ్లాల్సిన అవసరంలేదని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు స్పష్టం చేసారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డయల్ యువర్ జె.సి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రైతుల కల్లాల వద్దే ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఒకవేళ రైతులు ధాన్యం సేకరణ కేంద్రాల( పి.పి.సి )కు  ధాన్యాన్ని తీసుకువెళ్లినట్లయితే అందుకు అయ్యే రవాణా ఛార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే  ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుగా రైతులు తమ దగ్గరలోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో తమ వివరాలను నమోదుచేసుకోవలసి ఉందని పేర్కొన్నారు. రైతులు పి.పి.సిలకు వెళ్లే సమయంలో ధాన్యంలో తేమ శాతాన్ని లెక్కించేందుకు కేజీ ధాన్యంతో పాటు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి పేజీ, పట్టాదారు పాసు పుస్తకం లేదా యల్.ఇ.సి కార్డు లేదా టెన్ వన్ కాపీలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా తీసుకువెళ్లాలని స్పష్టంచేసారు. వివరాలు నమోదుచేసుకున్న తక్షణమే తమ కల్లాల వద్దకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని పలువురు ఫోన్ కాలర్స్  అడిగిన ప్రశ్నలకు జె.సి బదులిచ్చారు. రైతులు ఎటువంటి ఆందోళనకు  గురికావద్దని పేర్కొన్నారు. డయల్ యువర్ సంయుక్త కలెక్టర్ కార్యక్రమం అనంతరం ఫోన్ కాలర్స్ కోరిన ప్రాంతాలకు సిబ్బందిని పంపి వాటిని కొనుగోలు చేయాలని జె.సి పౌర సరఫరాల శాఖ అధికారి జి.నాగేశ్వరరావును ఆదేశించారు. ఇందులో ఎటువంటి జాప్యం జరగరాదని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతుల కల్లాల వద్దకే పి.పి.సిలు వెళ్లాలని, ఇందులో ఎటువంటి అలక్ష్యం వహించరాదని స్పష్టం చేసారు.