శ్రీకాకుళం : డిశంబరు 3 : మహిళలకు సంపూర్ణ భద్రత ఉండాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. మంగళ వారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ సంఘటన దురదృష్టకరమన్నారు. ఇటువంటి అంశాలు పునరావృతం కారాదని ఆయన పేర్కొన్నారు. శిక్షలు కఠినంగా ఉండాలని అన్నారు. అవసరమైతే చట్టాలను మరింత కఠినతరంగా ఉండాలని ఈ సంఘటన తెలియజేస్తుందన్నారు. అవసరమైన మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అన్నారు. జీరో ఎఫ్ ఐ ఆర్ ను ప్రతి పోలీసు స్టేషన్ లో అమలు చేయడం జరుగుతుందని ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలకు అధికార యంత్రాంగం అండగా ఉండాలని కోరారు. మహిళలకు సంపూర్ణ భద్రత ఉండాలని దీనిపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. జిల్లా ఆదర్శంగా ఉండాలనేది తన అభిమతం అన్నారు. తప్పులు ఎవరు చేసినా వెలికి తీయాలని మీడియాను కోరారు. అసాంఘిక శక్తులను వదిలి పెట్టారాదని చెప్పారు. చట్ట పరిధిలో కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మరింత పారదర్శకంగా ఆదర్శంగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా సంబంధిత కార్యాలయాల్లో కమిటీ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ప్రతి అర్హుడు సంక్షేమ పథకాలు అందుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. నవ రత్నాల కార్యక్రమంలో భాగంగా ప్రజల విశ్వాసం మేరకు ప్రజలకు చేరువగా పరిపాలన ఉంటుందని వివరించారు.పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి మాట్లాడుతూ విద్యార్ధినులకు భద్రతగా కళాశాలలు ఇతర ప్రదేశాల్లో అన్ని చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో షీ టీమ్ లు ఉన్నాయని పేర్కొంటూ 100 కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు పాల్గొన్నారు.
మహిళలకు సంపూర్ణ భద్రత అవసరం : రాష్ట్ర మంత్రి దర్మాన