విభిన్న ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం : రహదారులు, భవానాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం : డిశంబరు 3 : విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా వుంటుందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.  మంగళవారం స్ధానిక బాపూజీ కళామందిరంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మానవత్వం గల నాయకుడు మన ముఖ్యమంత్రి అని అన్నారు. ఆయన నీతివంతమైన పాలన అందిస్తున్నారని, న్యాయబధ్ధంగా పనిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో విభిన్న ప్రతిభావంతుల కష్టాలను చూసి చలించిపోయారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పింఛనుల పెంపుదల విషయంపై మొదటి సంతకం చేయడం జరిగిందన్నారు.అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని, ఇళ్ళస్థలాలను అందిస్తామని చెప్పారు. పథకాలకు దరఖాస్తు చేయాలని కోరారు.నిజాయితీ గల పాలన అందిండానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం మీది, మాది, మన అందరిదీ అని అన్నారు.  అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తొలగించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించాలని, రక్షణ కల్పించక పోతే ప్రభుత్వం వైఫల్యం జరిగినట్లేనని, తప్పులను క్షమించేది లేదని అన్నారు. విభిన్నప్రతిభావంతులు ఆత్మ స్థైర్యంతో మెలగాలని తెలిపారు. బాగా చదువుకుని అన్ని రంగాలలో రాణించాలన్నారు.జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, దివ్యాంగులకు ఒక సహాయ సంచాలకులను నియమించడం జరిగిందన్నారు.నవరత్నాలలో భాగంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల మంజూరులో  విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.జనవరి నుండి రేషన్ కార్డులను అందిస్తామన్నారు.విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు కలిగిన వారిపై చర్యలు చేపడతామన్నారు.  పింఛనులు, రుణాలను మంజూరు చేస్తామని తెలిపారు. నవరత్నాలలో అర్హత మేరకు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ, జిల్లాలోని సచివాలయ ఉద్యోగాలలో 40 మంది విభిన్న ప్రతిభావంతులను  నియమించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో, పోటీల్లో గెలుపొందిన వారిని సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. బధిరులకు టచ్ ఫోనులు అందించారు.  ఎన్.ఎ.సి.ఎల్. ఇండస్ట్రీస్ లి. వారు  ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి బహుమతులను స్పాన్సర్ చేసారు.జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా ఛైర్మన్ పి.జగన్మోహన రావు, డిఐసి జిఎం బి.గోపాలకృష్ణ, ఖజానా శాఖ డిడి జి.నిర్మలమ్మ, ఆర్టిసి డిప్యూటీ సిటీఎం కె. శ్రీనివాసరావు, పి.ఆర్.ఓ బి.ఎల్.పి.రావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎడి కె. జీవన్ బాబు, అంధవరపు వరాహనరసింహం, అంధవరపు సూరిబాబు, గొండు కృష్ణ మూర్తి, హెచ్. కిరణ్ కుమార్,సురంగి మోహన రావు, ఎన్.ఎ.సి.ఎల్ ఇండస్ట్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.వి.రాజులు, సి.ఎస్.ఆర్.టీమ్ వై.శంకరరావు,పి.ఆర్.ఓ. ప్రసాద్, మిస్రో, డా. జి. జనార్దన్ నాయుడు, మురళి, బెహరా మనోవికాస కేంద్రం నిర్వాహకులు శేఖర్  తదితరులు పాల్గొన్నారు.