త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ డీఎస్సీ ద్వారా అన్ని కేటగిరీల్లోనూ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే..రిటైర్ అయ్యే వారి వివరాలతో పాటుగా పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా సేకరించి డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం డీఎస్సీ-2018 పేరిట మొత్తం 7,902 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే దివ్యాంగుల కోసం 602 టీచర్‌ పోస్టులతో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కానీ విద్యార్హతలు ఇతర సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ పలువురు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. ఆ కేసులపై విచారణ పెండింగ్‌లో ఉంది. కోర్టు కేసులు లేని 2,654 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 22న జిల్లాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసుల కారణంగా ఇంకా 5,850 టీచర్‌ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. వాటిపై ఉన్న కేసులన్నింటినీ జనవరి నెలాఖరులోగా పరిష్కరించే దిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.