ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ అవార్డుల పరంపర

శ్రీకాకుళం : డిశంబరు 26 : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ అవార్డుల పరంపర కొనసాగాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కంపోనెంట్ నిధులతో చేపట్టే పనులపై ఆనందమయి ఫంక్షన్ హాల్ లో గురు వారం సమీక్షా సమావేశం జరిగింది. ప్రజ్వలన చేసి, మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి సమావేశాన్ని అతిథులు ప్రారంభించారు. 2018 -19 సంవత్సరానికి జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలుకుగాను జాతీయ స్ధాయిలో 3వ స్ధానంలో నిలిచినందుకు జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్.కూర్మారావుకు దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. సంబంధిత జిల్లా అధికారులు, ఉపాధి హామీ సిబ్బందికి జ్ఞాపికలను అందజేసారు.రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కంపోనెంట్ నిధులతో మంచి పనులు చేపట్టుటకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేయడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. మౌళిక సదుపాయాలు,  తాగునీరు, రహదారులు, విద్యాలయాలకు సౌకర్యాలు కల్పించుటకు అత్యంత ప్రయోజనకరంగా ఉపాధి హామీ పథకం నిలుస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి గ్రామాల్లో జరగాలని, పాలన ప్రజలకు అందుబాటులోకి రావాలని సభాపతి అన్నారు. జాతీయ అవార్డు రావడం సులభం కాదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉపాధి హామీ చక్కగా అమలు చేశారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి, సంబంధిత జిల్లా అధికారులను అభినందించారు. ఉపాధి హామీ లక్ష్యాలను అధిగమించాలని అందుకు ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా విజయం సాధించాలని సూచించారు. జిల్లాలో 3.96 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ కల్పించడం జరిగిందని తద్వారా రూ. 480 కోట్లు వేతనాలుగా ఖర్చు జరిగిందని అన్నారు. మెటీరియల్ కంపోనెంట్ 3 వందల కోట్లకు పైగా ఉందని దీనిని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. ఉపాధి హమీ వలన వలసలు నివారించామని దీనిని సున్నా స్థాయికి తగ్గిద్దామని పిలుపునిచ్చారు. ఉపాధి హామీని అన్ని రంగాలకు అనుసంధానం చేసి అనుకున్న ప్రగతి సాధనకు అడుగులు వేద్దామని కోరారు. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని సూచనలు వస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధి హామీకి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించుటకు గొప్ప అవకాశమని అన్నారు. గ్రామాల్లో ఉపాధి లభిస్తుందనే భరోసా ఇస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ జాతీయ అవార్డు మరోసారి సాధించి జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. రూ.3 వందల కోట్ల మెటీరియల్ కంపోనెంట్ నిధులు ఉత్పత్తి చేయడం ఆనందంగా ఉందని అన్నారు. జాతీయ అవార్డు సాధించామని అది బాధ్యతను పెంచిందని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పనుల బిల్లులు చెల్లింపులో సమస్య రాదని, ఇటీవల పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చేపట్టిన సమీక్షలో మంత్రి స్పష్టం చేసారని అన్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు దృష్టి సారించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. రాబోయే మూడు నెలల కాలంలో పనుల పూర్తికి శ్రద్ద వహించాలని చెప్పారు. వేతనదారులకు మరిన్ని సూచనలు, సలహాలు అందించి అధిక సంఖ్యలో పనులు చేపట్టుటకు కృషి చేయాలని అన్నారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఆశయమన్నారు. అనేక పథకాలు ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. అవినీతి రహితంగా పాలన సాగించాలని ముఖ్యమంత్రి ఆలోచనతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంచి రహదారులు నిర్మించాలన్నారు. పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ అవసరాలను గుర్తించి పనులు చేయాలని అన్నారు. రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అవసరం అన్నారు. వ్యవసాయానికి అవసరమైన రహదారులకు అవకాశం కల్పించాలని కోరారు. చెరువుల పూడికతీత చేపట్టి జలవనరుల పరిరక్షణకు అవకాశం కల్పించాలని సూచించారు. గ్రామాల్లో అవసరాలు గుర్తించి పనులు చేపట్టాలని అన్నారు. పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ అవార్డు తీసుకువచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కంపోనెంట్ తో రూపురేఖలు మారే స్థితి ఉందని, వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు అవకాశం అధికంగా ఉందని చెప్పారు. పాతపట్నం వెనుకబడిన నియోజకవర్గమని ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా పనులు చేపట్టాలని అన్నారు. గ్రామ సచివాలయాలు మంచి వ్యవస్థ అన్నారు. పలాస శాసన సభ్యులు సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ మెటీరియల్ కంపోనెంట్ క్రింద రూ.353 కోట్లు రావడం సంతోషదాయకమన్నారు. ఉపాధి హామీ పనులు పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో రాజధాని అవసరం తెలియజేస్తుందన్నారు. ఉపాధి పథకం ఉద్దానంను ఆదుకుంటుందని చెప్పారు.జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జాతీయం అవార్డు వేతనదారుల కృషి అన్నారు. గత ఏడాది రూ.3 వందల కోట్లు మెటీరియల్ కంపోనెంట్ నిధులు ఖర్చు చేసామన్నారు. అనుకున్న లక్ష్యం కంటే 105 శాతం అధికంగా వేతన ఉత్పాదన జరిగిందని అన్నారు. ఈ ఏడాది వెయ్యి కోట్ల పనులు మెటీరియల్ కంపోనెంట్ నిధులతో పనులు చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలో అన్ని సచివాలయాల భవనాల నిర్మాణానికి పనులు మంజూరు చేసామని చెప్పారు. రూ.345 కోట్లతో సిసి రోడ్లు, రూ.117 కోట్లతో సిసి డ్రైన్లు మంజూరు చేసామని, మరో రూ.2 వందల కోట్లతో డ్రైన్ల పనులను మంజూరుకు అవకాశం ఉందని అన్నారు. రాబోయే 3 నెలలు చాలా కీలకమని, అవార్డు స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనులు చేస్తూ మరో జాతీయ అవార్డు సాధించాలని హితవు పలికారు. గత ఏడాది కేంద్ర బృందం పర్యటించి అన్ని అంశాల్లో సంతృప్తి చెందిందని చెప్పారు. ఈ ఏడాది పాఠశాలల్లో పనులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు.