శ్రీకాకుళం : డిశంబరు16 : ప్రతీ గురువారం ప్రత్యేక అధికారులు తప్పని సరిగా గ్రామాలలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ వివిధ అంశాలపై పలు సూచనలు జారీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రత్యేక అధికారులు నోడల్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.గ్రామ వాలంటీర్ల పనితీరుపై పర్యవేక్షించాలన్నారు. వారి హాజరీని, పని తీరును పర్యవేక్షించి, పరిశీలించాలన్నారు. అదే విధంగా వారంలో ఒక రోజు గ్రామాలలో రాత్రి బసలను చేయాలని చేప్పారు.హాస్టళ్ళ పరిశుభ్రత, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, పుస్తకాలను విద్యార్థులందరికీ అందచేయడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలని తెలిపారు.హాస్టల్స్ లో పరిశుభ్రవాతావరణాన్ని కలుగచేసి వాటి రూపురేఖలను మార్చాలని అన్నారు. ఎ.ఇ.లతో సమావేశమై,ఇంజనీరింగు పనులను కూడా పర్యవేక్షించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు ప్రతీ గురువారం సిసి రోడ్లు, అంగన్వాడీ భవనాలు వంటి వివిధ అభివృధ్ధి కార్యక్రమాలను ప్రారంభించే దిశగా పని చేయాలన్నారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జిల్లాకు జాతీయ పురస్కారం లభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఉన్నతాధికారుల నుండి క్షేత్రస్ధాయిలోని పనివారల వరకు కృషి చేయడం వలన ఈ అవార్డు మన జిల్లాకు దక్కిందన్నారు. పంచాయితీరాజ్, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, గ్రామీణ అభివృధ్ధి సంస్థ, నీటి యాజమాన్య సంస్థల అనుసంధానంతో ఉపాధిహామీ కన్వెర్జన్సీ ద్వారా జిల్లా అభివృధ్ధికి కృషి చేయడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా పని చేయడానికి ప్రణాళికలు నిర్దేశించుకోవాలని సూచించారు.నాబార్డ్ రూపొందించిన పొటెన్సిషియల్ లింక్ డ్ క్రెడిట్ ప్లాన్- 2020-2021 పుస్తకాన్ని కలెక్టర్ చేతులమీదుగా విడుదల చేసారు.కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఆంధ్రాబ్యాంక్ లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.హరిప్రసాద్, ఎ.జి.ఎం. కె.వెంకటరావు, నాబార్డ్ డి.డి.ఎం. మిలింద్ క్లా షాల్కర్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.సి. కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్ మహాలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య, జిల్లా విద్యాశాఖాధికారి యం.చంద్రకళ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గురువారం ప్రత్యేక అధికారుల గ్రామాల పర్యటన : జిల్లా కలెక్టర్ జె.నివాస్