క్రిస్మస్ వేడుకలలో మంత్రి ధర్మాన

శ్రీకాకుళం : డిశంబరు 20 : శాంతి యుత సమాజ స్థాపనకు క్రీస్తు బోధనలు అవసరమని రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్  పేర్కొన్నారు.శుక్రవారం స్ధానిక వై.ఎస్.ఆర్.కళ్యాణమండపం లో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా తేనీటి విందు కార్యక్రమం జరిగింది.  కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మానవాళి మనుగడకు, సమాజ అభ్యన్నతికి, శాంతి యుత సమాజ స్థాపనకు క్రీస్తు బోధనలు అవసరమని అన్నారు. క్రీస్తు ప్రభోదాలు ఆచరణీయమని,  సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సర్వతోముఖాభివృద్ది సాధించాలని కోరుకుంటున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, మానవతే మా మతం అన్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. మైనారిటీలకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. క్రైస్తవ మతాన్ని  ఆచరిస్తున్నవారు అత్యంత గౌరవనీయ వ్యక్తులుగా సామరస్య పూర్వకంగా జిల్లాలో చూడడం జరుగుతున్నారు. అందరూ మత సామరస్యంతో ఉండాలని, జిల్లా లో శాంతి ఎప్పటి వలె కొనసాగాలని, క్రిస్మస్ అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.క్రైస్తవులకు  ప్రభుత్వం మంజూరు చేసిన స్థలానికి అవసరమగు సహాయాన్ని అందించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు మాట్లాడుతూ క్రైసవులు క్రమశిక్షణతో మెలుగుతారన్నారు.  నవరత్నాలలో ఫాస్టర్ లకు 5వేల రూపాయలు  పారితోషికం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 820 మంది ఫాస్టర్ లను గుర్తించడం జరిగిందని, 370 మంది వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన వారందరూ ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు.  అమ్మ ఒడి, విద్యార్ధులకు స్కాలర్ షిప్ , విద్యాదీవెన, విదేశీ విద్యా పథకం వంటి  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు. ప్రతీ ఒక్కరు తప్పని సరిగా చదువుకోవాలన్నారు. ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అందించిన స్థలంలో సౌకర్యాలు కల్పించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి ఎం.అన్నపూర్ణ మాట్లాడుతూ తమశాఖ తరపున అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. మత పెద్దలు ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ, జిల్లా బిసి సంక్షేమ అధికారి కె కె. కృత్తిక,  సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ,  ఖజానా శాఖ సీనియర్ అక్కౌంట్స్ అధికారి సావిత్రి,  పి.ఎం. 15 సూత్రాల కార్యక్రమం సభ్యులు మహిబుల్లా ఖాన్, మాజీ పురపాలక అధ్యక్షులు అంధవరపు వరాహ నరసింహం , క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాక కృపానందం, సి హెచ్ ప్రేమ్ కుమార్, డి ఎస్ వి ఎస్ కుమార్, గోడి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.