విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని భాజపా ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలో ఎంపీ సుజనా విలేకర్లతో మాట్లాడుతూ.. రాజధానికి అత్యవసర మౌలిక వసతుల ఖర్చు ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. అయితే కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలూ విఫలమైనట్లు చెప్పారు. విభజన చట్టం మేరకు పలు విభాగాల కింద కొన్ని నిధులు వచ్చాయని వెల్లడించారు. అప్పట్లో అమరావతిపై కొందరు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు వెళ్లారని పేర్కొన్నారు. రాజధానిలో నిర్మాణాల ప్రక్రియలో జాప్యం జరిగిందని తెలిపారు. అమరావతి అభివృద్ధి పనులకు రూ. 5,674 కోట్లను అడ్వాన్స్ కింద ఇచ్చారన్నారు. ఈ ఐదేళ్లలో అనేక ప్రైవేటు విద్యాసంస్థలు వచ్చాయని చెప్పారు. అమరావతి కోసం ప్రజలు రూ.42 కోట్లు విరాళం ఇచ్చారని వివరించారు.వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతిలో ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని భాజపా ఎంపీ విమర్శించారు. అమరావతిని రాజధానిగా జగన్ గతంలో ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వస్తే మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జీఎన్ రావు కమిటీకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రస్తావన ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి 40 రోజులు మాత్రమేనని తెలిపారు. జీఎన్ రావు కమిటీ తలాతోక లేని నివేదిక ఇచ్చిందని ఎంపీ సుజనా విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలను పలు చోట్ల పెడితే ఎలాంటి లాభం ఉండదని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చని సుజనా అభిప్రాయపడ్డారు. తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీలు కడుతున్నారని చెప్పారు. గుత్తేదారులు కోర్టుకు వెళ్తే పరిహారం చెల్లించగలరా అని ప్రశ్నించారు. మొత్తం లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. ఇలా ముందుకెళ్తే సన్‌రైజ్ ఏపీ కాస్తా సన్‌సెట్ ఏపీ అవుతుందని వ్యాఖ్యానించారు.
అప్పుడు అమరావతిని ఒప్పుకొని ఇప్పుడు ఇలా అంటే ఎలా? సుజనా