కళాశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి

శ్రీకాకుళం : డిశంబరు 2 :  కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటకు తగు చర్యలు తీసుకోవలసినదిగా మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ను జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఇటీవల మహిళా కళాశాలలో జరిగిన స్వచ్చభారత్ కార్యక్రమం సంధర్బంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి  జరుగుచున్న  పనులను  జిల్లా కలెక్టరు జె.నివాస్ పరిశీలించారు. ఈ సంధర్బంగా కళాశాల వాతావరణం అపరిశుభ్రంగా ఉండుటపై కళాశాల ప్రిన్సిపాల్ పై అసహనం వ్యక్తంచేసారు.ఇటీవలే విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని శుభ్రపరచి, అభివృద్ది పనులను చేపడుతున్న నేపద్యంలో కళాశాలలో మరల చెత్తను వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసారు.కళాశాలలో డస్ట్ బిన్ లను ఏర్పాటుచేసి చెత్తను అందులో వేసేలా చూడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి సిబ్బంది కూడా బాధ్యత తీసుకోవాలని తెలిపారు.కళాశాల ప్రాంగణంలోయితరులు ప్రవేశించి పరిసరాలను అపరిశుభ్రం చేయకుండా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.కళాశాల ప్రాంగణంలో తుప్పలు తొలగించి, శుభ్రం చేస్తున్న పనులను జిల్లా కలెక్టరు పరిశీలించారు.కళాశాల ప్రాంగణంలో గల వసతి గృహాల నుండి వచ్చే మురుగునీటి సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై మున్సిపల్ సిబ్బందితో చర్చించారు. కళాశాలలో రోడ్డు పొడవునా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.