శ్రీకాకుళం : డిసెంబర్ 19 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన శ్రీకాకుళం జిల్లా జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలవడం ద్వారా జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్. కూర్మారావులు జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేశారు. గురువారం న్యూఢిల్లీలోని సి సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేతుల మీదగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మరియు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్ కూర్మా రావులు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సింహా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జిల్లానుంచి వెళ్ళిన వారిలో విజిలెన్స్ అధికారి అర్ వెంకట్రామన్ ఉన్నారు.ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ పురస్కారం లభించడం మరింత బాధ్యతను పెంచిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్ కూర్మారావు అన్నారు. ఇందుకు బాధ్యులైన సిబ్బందికి ఆయన అభినందిస్తూ నే భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో గ్రామాల్లో పరుగులు తీసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. జాబ్ కార్డు ఉన్న వారందరికీ పనులు కల్పించడమే ద్యేయంగా క్షేత్ర యి సిబ్బందిని సమన్వయం చేసుకుని పనులు చేపడతామని అన్నారు.
ఉపాధి హామీ పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ మరియు డ్వామా పీడీ