శ్రీకాకుళం : డిశంబరు 4 : ఉపాధి హామీ పథకంలో దేశంలో అగ్రగామిగా రాష్ట్రన్ని నిలబెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం పనులపై జిల్లా కలెక్టర్ లతో బుధ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో గ్రామ సచివాలయాలు, సిసి రోడ్లు, సిసి కాలువలు, పాఠశాలల ప్రహారీ గోడలు, గృహ లే అవుట్లు చేపట్టుటకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మెటీరియల్ కాంపోనెంట్ క్రింద ఆస్తులను సృష్టించాలని పేర్కొంటూ నిర్మాణంలో నాణ్యత ఉండాలని స్పష్టం చేసారు. సిసి కాలువలకు పైన మూతలు పెట్టాలని సూచించారు. నియోజకవర్గానికి ఉపాధి హామీ క్రింద రూ.16 కోట్ల వరకు మంజూరు చేసామని అయితే అనుకున్న ప్రగతి కనిపించలేదని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. చేపడుతున్న పనుల చెల్లింపులకు సమస్య లేదని మంత్రి చెప్పారు. వేతనదారులకు చెల్లింపులపై తెలియజేయాలని అన్నారు. చేపట్టబోయే పనులకు పరిపాలన ఆమోదం ఇచ్చి వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక చెక్ పోస్టుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అన్నారు.రాష్ట్ర పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ గ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ఉపాధి కల్పనకు మంచి వనరుగా ఉపయోగపడుతుందని చెప్పారు. సచివాలయ పోస్టులు భర్తీ పూర్తి చేయాలి. ఈ దఫా పూర్తి అయితే మరో నోటిఫికేషన్ జారీ చేయుటకు చర్యలు చేపడతామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప జిల్లాల్లో మెటీరియల్ కంపోనెంట్ ఎక్కువగా జనరేట్ చేశారు.జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జూన్ నాటికి రూ.1000 కోట్లు ఉపాధి హామీ మెటీరియల్ కంపోనెంట్ రానుందని చెప్పారు. ఇప్పటికే రూ.820 కోట్ల వరకు మంజూరు చేసామన్నారు. గ్రామ సచివాలయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గతంలో మంజూరు చేసిన సిసి రహదారులు పరిశీలించి అవసరం మేరకు మంజూరు ఇస్తామని తెలిపారు. గృహ నిర్మాణ సంస్థకు సిమెంటు సరఫరాలో అనుసంధానం చేసినట్లు మిగిలిన శాఖలకు కూడా అనుసంధానం చేయాలని కోరారు. గృహ లే అవుట్లకు భూమి చదును చేసినవుడే సర్వే రాళ్లు వేయుటకు అవకాశం కల్పించాలని అన్నారు. గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.ఐటీడీఏ పిఓ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 160 శాతం వరకు పనులు గుర్తించామన్నారు. భూమి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, గిరిజన ప్రాంతంలో రూ.112 కోట్లతో మెటీరియల్ కంపోనెంట్ క్రింద పనులు మంజూరు చేసామన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్సులో సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు, గృహ నిర్మాణ సంస్థ పిడి పి.వేణుగోపాల్, జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఇ ఎస్.రామ్మోహన్, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులలో అగ్రగామిగా నిలవాలి