శ్రీకాకుళం : డిశంబరు 13: నాగావళి స్వయం ఉపాధి శిక్షణా సంస్థ నైరెడ్ ద్వారా స్వయం ఉపాధి శిక్షణ పొందిన వారికి ముద్ర రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ బ్యాంకర్లను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో డి.ఎల్.ఆర్.ఎ.సి. సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నైరెడ్ ద్వారా శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కోసం బ్యాంకర్లు ముద్ర రుణాలను అందించి వారు జీవితంలో స్థిరపడడానికి సాయపడాలన్నారు.ఇప్పటి వరకు ఇస్తున్న ట్రైనింగ్ లతో పాటు నర్సింగ్, హోటల్ మేనేజ్ మెంట్, డ్రెస్ డిజైనింగ్ వంటి తక్షణ ఉపాధి కలిగించే కోర్సులను ప్రవేశపెట్టాలని నైరెడ్ సంస్ధ అధికారులకు సూచించారు.ట్రైనింగ్ ఇవ్వబోయే కోర్సుల వివరాలను ముందుగా తెలియచేయాలని, వాటిపై వాలంటీర్ల ద్వారా అవగాహన కలిగిస్తామని కలెక్టర్ తెలిపారు. మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని యువతకు మెరుగైన ఉపాధి కలిగించాలని కలెక్టర్ సూచించారు.నైరెడ్ డైరక్టర్ ఎం.కృష్ణ మూర్తి తమ సంస్ధ ద్వారా అందిస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాలను వివరించారు. ఎంటర్ ప్రెన్యూర్ డెవలెప్ మెంట్ ప్రోగ్రామ్స్ పై శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. అప్పడాల తయారీ, పచ్చళ్ళ తయారీ, పుట్ట గొడుగుల పెంపకాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కలిగిస్తున్నామని తెలిపారు.దేశంలోనే తమ సంస్ధతకు అత్యుత్తమ సంస్ధ అవార్డు వచ్చిందని తెలిపారు. రిటైరైన మిలటరీ ఉద్యోగులకు అవసరమైన శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు.రెడ్ క్రాస్ సహాయంతో హోమ్ నర్సింగ్ కోర్సును ఇస్తున్నట్లు తెలిపారు.
నైరెడ్ లో శిక్షణ పొందిన వారికి ముద్ర లోనులివ్వాలి.