ఉల్లి ...,........ఇటు వంటింట్లోనే కాదు అటు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ కొండెక్కి కూర్చుంది. ధరలో సెంచరీ దాటేసిన దీనిని పట్టుకునేందుకు ఎవరి తరమూ కావట్లేదు. ఇప్పటికే ఇళ్లల్లో చాలా మటుకు ఉల్లికి స్వస్తి పలకగా, ఆ దిశగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు సైతం పయనిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు ఏకంగా బిర్యానీలో ఉచితంగా ఇచ్చే ఆనియన్ సలాడ్‌కు ప్రత్యేక రేటు నిర్ణయించేశాయి. మరికొన్ని మొత్తంగా ఉల్లికి టాటా చెప్పేసి కీర, క్యారెట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేస్తున్నాయి. ఇక పలు హోటళ్లలో ఆనియన్ దోశ ఊసే ఎత్తడం లేదు. కొన్ని రోజుల పాటు ఉల్లితో ముడిపడి ఉన్న ఆహార పదార్థాలకు తాత్కాలిక బ్రేక్ వేస్తే మంచిదన్న అభిప్రాయానికొచ్చేశారు. ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ వరకు.. హోటల్, రెస్టారెంట్ వంటకాలు ఎక్కువగా ఆనియన్‌తో ముడిపడి ఉంటాయి. ఆహార ప్రియులు ఎక్కువగా ఆనియన్ తెప్పించుకుని మరీ తమకిష్టమైన వంటకాలతో కలిపి భుజించడం షరామామూలు. ఇక బిర్యానీకి ఆనియన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఉల్లి ధరలు కొండెక్కి కూర్చోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వాటి వాడకాన్ని తగ్గించేశారు. ఇక అంతగా వినియోగదారులను పోగొట్టుకోవడం ఇష్టం లేక అంతగా అవసరమైతే కొసరి కొసరి అందిస్తున్నారు. అది కూడా ఆనియన్ దోశ అయితేనే. బిర్యానీ, చపాతి, పరోటా ఇలా తదితర వంటకాల్లో ఉచితంగా ఇచ్చే ఆనియన్‌కు దాదాపుగా గుడ్‌బై చెప్పేశారు. ఇక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అయితే ఉల్లి ప్రసక్తే లేకుండాపోయింది
అయ్య బాబోయ్ ఉల్లిపాయ ?