శ్రీకాకుళం : డిశంబరు 9 : నవశకం కార్యక్రమంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలకు లబ్దిదారుల గుర్తింపు దాదాపుగా పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఈ జాబితాలను గ్రామాల్లో సోషల్ ఆడిట్ నిమిత్తం ప్రదర్శించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అర్హమైన లబ్దిదారులను గుర్తించుటకు, అర్హత కలిగి ఉండి జాబితాలో లేని వారి పేర్లను చేర్చుటకు సోషల్ ఆడిట్ ప్రధానమని ఆయన అన్నారు. స్పందన కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సోమ వారం సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందుటకు ప్రజా సాధికార సర్వే అవసరమని, జిల్లాలో ఇంకా 1.31 లక్షల మంది ప్రజా సాధికార సర్వే (పి.ఎస్.ఎస్) చేయించుకోవలసి ఉన్నట్లు నవ శకం సర్వేలో తేలిందని అన్నారు. ప్రజా సాధికార సర్వే చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని ఆయన కోరారు. నవ శకంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల క్రింద గుర్తించిన లబ్దిదారుల జాబితాలను పక్కాగా పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. దర్జీలు, నాయీ బ్రాహ్మణులు తదితర రంగాల్లో అధికంగా దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొంటూ ఎక్కడా అనర్హతగల వ్యక్తులు ఉండరాదని పేర్కొన్నారు.
సోషల్ ఆడిట్ కు నవశకం లబ్దిదారుల జాబితా : జిల్లా కలెక్టరు