శ్రీకాకుళం : జనవరి 6: నాడు-నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం కలెక్టర్ ప్రత్యేక అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. నాడు-నేడు కార్యక్రమం అమలులో తల్లితండ్రుల కమిటీ పాత్ర (పేరెంట్స్ కమిటీ) కీలకమన్నారు. పాఠశాలలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. మరమ్మత్తులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారుచే ఎస్టిమేషన్ వేయించాలని తెలిపారు. ప్రత్యేక అధికారులు పాఠశాలలను పర్యవేక్షించాలన్నారు. నోడల్ అధికారులు విలేజ్ వాలంటీర్లు, సెక్రటేరియట్ ఉద్యోగులతో తప్పనిసరిగా సమావేశాలను ఏర్పాటుచేయాలన్నారు.వై.ఎస్.ఆర్. విద్యాదీవెన, వసతి దీవెన, కాపు నేస్తం పథకాల లబ్దిదారుల జాబితాలను సెక్రటేరియట్ లలో డిస్ప్లే చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. నూర్పు అయిన పంటను పొలం నుండి మిల్లులకు తరలించడానికి చర్యలు చేపట్టాలన్నారు. వి.ఆర్.ఓ.లు,వి.ఆర్.ఎ.లు, అగ్రికల్చర్ అధికారులు ధాన్యం కొనుగోలు పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హాస్టల్స్ లో ప్రహారీ గోడలను నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, గృహనిర్మాణ సంస్ధ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జి.శ్రీధర్, ఎస్.సి.కార్పోరేషన్, బి.సి.కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.మహాలక్ష్మి, జి.రాజారావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎం.చంద్రకళ, ఎ.డి.హేండ్లూమ్స్ అండ్ టెక్సటైల్స్ వి.పద్మ, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఇ. శ్రీనివాసరావు తదితరులు హాజరైనారు.
నాడు-నేడు కార్యక్రమం విజయవంతం చేయండి : కలెక్టరు నివాస్