పిబ్రవరి 1 నుంచి ఇంటికే పింఛను .

అమరావతి : రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటికే పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘ఫిబ్రవరి 15 నుంచి 21వ తేదీ వరకూ కొత్త పెన్షన్‌ కార్డులు, కొత్త బియ్యం కార్డుల పంపిణీ ఉంటుంది. ఉగాది నాటికి 25 లక్షల మంది మహిళల పేరిట ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తాం. నేను గ్రామాల్లో పర్యటించేటప్పుడు,ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా అనడిగితే చేయెత్తే పరిస్థితి రాకూడదు’ అని అన్నారు. ఫిబ్రవరి 28న ‘జగనన్న విద్యావసతి దీవెన’ ప్రారంభమవుతుందని, ఇప్పుడు మొదటి విడత, జూలై-ఆగస్టులో రెండోవిడత నిధులు మంజూరవుతాయన్నారు.
సచివాలయాల ద్వారా 541 సేవలుగ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు కేవలం 72 గంటల్లో అందించాలని నిర్దేశించుకున్నామని సీఎం చెప్పారు. 541 సేవలు ఎన్ని రోజుల్లో అందుతాయో గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. ‘కంటి వెలుగు’లో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి మూడో విడత కార్యక్రమం అమలవుతుందని అన్నారు. ఫిబ్రవరిలో 4,906 కొత్త ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి పనులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మఒడిలో 1,07,290 ట్రాన్సాక్షన్లు ఫెయిలైనట్లు అధికారులు గుర్తించారని కలెక్టర్లు సీఎంకు తెలిపారు. లబ్ధిదారులకు వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని స్పష్టం చేశారు. ఇసుక డోర్‌ డెలివరీని ఈనెల 30న అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రారంభిస్తామని, ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్‌ డెలివరీ మొదలవుతుందని చెప్పారు. దిశ పోలీసు స్టేషన్ల ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. స్పందన కింద వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 60శాతం వరకూ బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయన్నారు. బియ్యం కార్డు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అందజేయాలన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో దళారీ వ్యవస్థ లేకుండా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అవినీతి లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేస్తున్నామన్నారు. ఈ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గుర్తుచేశారు.గ్రామీణ ఆర్థిక వృద్ధికి ‘భరోసా’ఏప్రిల్‌ నెలాఖరు  నాటికి 3,300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమవుతాయని సీఎం జగన్‌ చెప్పారు. 11 వేలకు పైగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పశువులకు హెల్త్‌ కార్డులు మంజూరు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్సు అనంతరం మీడియాకు పంపిన వీడియో సందేశంలో ఆయన వెల్లడించిన అభిప్రాయాలివీ.గ్రామ సచివాలయాల్లోనే రైతు భరోసా కేంద్రాలు.11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.నాణ్యతతో కూడిన ఎరువులు.  విత్తనాల పంపిణీరూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.రైతు పంట వేసేటప్పటికే ధర ఎంతో తెలుస్తుంది. దానిని అందజేస్తాం.రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా  ప్రకటనలు జారీ చేశాం. ఆ ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మార్కెట్లో ఆ ధర కంటే ఎక్కువకే కొనుగోళ్లు జరగాలి. రాబోయే రోజుల్లో విత్తనాల సరఫరా కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయ విధానంలో మెలకువలూ నేర్పుతాం.