ఘనంగా 10వ జాతీయ ఓటర్ల దినోత్సవం

శ్రీకాకుళం : జనవరి 25 : 10వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది.  శనివారం  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల నుండి బాపూజీ కళామందిర్ వరకు భారీ రాలీ జరిగింది.  ర్యాలీని  జిల్లా కలెక్టర్ జె నివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం  బాపూజీ కళామందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్  జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ మనది ప్రజాస్వామ్య దేశమని, మన రాజ్యాంగం  చాలా గొప్పదని అన్నారు. అనేక మతాలు, జాతులు, భాషలు,  కులాలు వున్నా భిన్నత్వంలో ఏకత్వంతో విరాజిల్లుతున్న గొప్ప దేశం మనదన్నారు.  ప్రజాస్వామ్యంలో మాత్రమే భావ స్వేచ్ఛకు అవకాశం వుంటుందని చెప్పారు.   ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటంగ్ ప్రక్రియ పూనాది అన్నారు. ముఖ్యంగా యువత, విద్యాధికులు  ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.  అధిక శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటు హక్కును వినియోగించుకుని  రాజ్యాంగాన్ని గౌరవించుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు.  మన దేశంలో  ఓటు వేయని వారూ 30 శాతం ఉన్నారని, గెలుపొందిన పార్టీలు సాధించినది 30 శాతం ఓట్లేనని చెప్పారు.  ఎన్నికల ప్రక్రియలో చదువు కున్నవారికి మాత్రమే అనేక చోట్ల ఓటుహక్కు వున్నట్లు తెలిపారు. భారత దేశంలో మాత్రమే వయోజన ఓటు హక్కు వుందన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతున్నదని, హాంగ్ కాంగ్ లో ప్రజాస్వామ్యం కావాలని కోరుతున్నారని చెప్పారు.  రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పారు. ఓటరు గా నమోదు సులభమని, ఆన్ లైన్ ద్వారా, యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని అన్నారు. తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో వున్నదో తెలుసుకునేందుకు మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు.  ఆరు నెలలపాటు ఒకే చోట వున్నవారికి అక్కడే ఓటు హక్కును కల్పించడం జరుగుతుందని  తెలిపారు. యువత విజ్ఞతతో ఓటు వేసి మంచి పాలకులను ఎన్నుకోవాలని, ఓటు హక్కు వున్న వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.జాయింట్ కలెక్టర్ డా కె.శ్రీనివాసులు మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కలిగించుటకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట ఓటు వేసుకునే అవకాశాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు.రెవిన్యూ డివిజనల్ అధికారి  ఎం. వి.రమణ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యం గొప్పదని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటరుగా నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్ నివాస్ కు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఓటరు గుర్తింపు కార్డు ను అందజేశారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న యువతకు జిల్లా కలెక్టర్ ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజెన్ లను సత్కరించారు. బి.ఎల్.ఓ.లు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు  సి.హెచ్.వి.రాంప్రసాద్ లను సన్మానించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, వ్యక్తృత్వపు పోటీలు, రంగోలీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.  శివానీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓటరు అవగాహన పై లఘు నాటికి ప్రదర్శించారు. జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణా రావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, సెట్ శ్రీ సిఇఓ బి.వి.ప్రసాద రావు,  తహశీల్దార్ ఐ.టి.కుమార్, శివానీ కళాశాల ఎం.డి దుప్పల వెంకట రావు, డి.ఎస్.డి.ఓ బి.శ్రీనివాస్ కుమార్, సన్ డిగ్రీ కళాశాల కరెస్పాండంట్ జయరాం, స్వీప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రమణ మూర్తి,ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు జనార్దన్ నాయుడు, సురంగి మోహన రావు, నటుకుల మోహన్ ఎన్. సి.సి, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.