10వ తేదీన ఎలాగైనా రావాలి.

హైదరాబాద్‌ : జనవరి 5 : అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తదుపరి విచారించనున్న ఈ నెల 10వ తేదీన  ఆయన వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరు కావలసిందేనని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ, ఆడిటర్‌ విజయసాయిరెడ్డి కూడా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సీఎంగా విధుల్లో బిజీగా ఉన్నందున జగన్‌ హాజరుకాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు.రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున వీరిద్దరి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1వ తేదీన చివరిసారిగా జగన్‌ కోర్టుకు హాజరయ్యారని అప్పటి నుంచి ఏదో ఒక కారణం చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి గత ఏడాది మే, సెప్టెంబరు, నవంబరుల్లో ఒక్కోసారి మాత్రమే హాజరయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సారికి హాజరు మినహాయింపు పిటిషన్‌ను అనుమతిస్తున్నానని,  తదుపరి విచారణ రోజున అంటే ఈనెల 10వ తేదీన  జగన్‌, విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.జగన్‌ అక్రమాస్తుల కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభించే ముందు జగన్‌, ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు, సీబీఐ న్యాయవాదులు మాత్రమే కోర్టు హాలులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో మిగిలిన వారంతా వెళ్లిపోయారు. తర్వాత కోర్టు ప్రధాన ద్వారం తలుపులు మూసేశారు. అయితే దేశ భద్రతకు సంబంధించిన, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడికి సంబంధించిన కేసుల్లో మాత్రమే ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్‌ పద్ధతిలో విచారణ జరపడం సంప్రదాయంగా వస్తోంది. నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయి. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన ఈ కేసును న్యాయమూర్తి ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్‌లో విచారించడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.పెన్నా చార్జిషీటుపై 10 వ తేదీన  ఉత్తర్వులుజగన్‌ సంస్థల్లో పెన్నా సిమెంట్స్‌ పెట్టుబడులకు సంబంధించిన కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటును విచారణకు స్వీకరించేదీ లేనిదీ ఈనెల 10న ఉత్తర్వులు జారీచేస్తామని సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు తెలిపారు. ఈ మేరకు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఐఏఎస్‌ మైనంపల్లి శామ్యూల్‌, అనంతపురం జిల్లా అప్పటి డీఆర్‌వో ముక్కమల్ల సుదర్శన్‌రెడ్డి, అప్పటి యాడికి తహశీల్దార్‌ మాతంగి యల్లమ్మ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌లను కూడా నిందితులుగా చేర్చాలని సీబీఐ 2016లో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. అయితే ఇందులో కొత్త అంశాలేవీ లేవని, ప్రధాన చార్జిషీటులో పేర్కొన్న అంశాలనే పొందుపరచి వీరిని నిందితులుగా చేర్చారని దీనిని విచారణకు స్వీకరించరాదని పెన్నా సిమెంట్స్‌ తరఫు న్యాయవాది వాదించారు. నిందితులకు సమన్లు జారీచేయాలని సీబీఐ స్పెషల్‌ పీపీ విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి తీర్పును ఈ నెల10వ తేదీకి వాయిదా వేశారు.