శ్రీకాకుళం : జనవరి 10: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల సౌకర్యార్ధం 100 బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజా రవాణా శాఖ (ఆర్.టి.సి.) డిప్యూటీ కమీషనరు జి.వరలక్ష్మి తెలిపారు.శుక్రవారం ప్రజా రవాణా శాఖ (ఆర్.టి.సి.) కార్యాలయంలోని డిప్యూటీ కమీషనరు ఛాంబరులో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా అదనంగా 100 ప్రత్యేక బస్సులను వేసామని, ఇందు నిమిత్తం స్కూల్ బస్సులు, స్పేర్ బస్సులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. డిపో- 1 నుండి విశాఖపట్నానికి, డిపో-2 ద్వారా పాలకొండ, రాజాం, టెక్కలి, పాతపట్నం వంటి పరిసర ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కలిగించడం జరిగుతున్నదన్నారు. హైదరాబాదుకు ప్రత్యేక సర్వీసుల క్రింద 30బస్సులను వేయడం జరిగిందన్నారు. పండుగకు ముందుగాను, పండగ తర్వాత ప్రి పొంగల్, పోస్ట్ పొంగల్, సర్వీసు సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9 నుండి 20వ తేదీ వరకు స్పెషల్ బస్సు సర్వీసులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు మరిన్ని అదనపు బస్సులను కూడా వేస్తామని తెలిపారు. విశాఖపట్టణానికి ప్రతీ అయిదు నిముషాలకు బస్సు సౌకర్యం వుంటుందన్నారు. ట్రాఫిక్ క్లియరెన్సు కోసం ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. మెయిన్ పాయంట్లలో గ్రౌండ్ బుకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసామన్నారు. సంక్రాంతికి గతేడాది రూ. 35 లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు.మెరుగైన సేవలను అందించడానికి ప్రజా రావాణా శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు.ఈ సమావేశానికి 1 మరియు 2 డిపో అసిస్టెంట్ కమీషనర్లు వి.ప్రవీణ, టి.కవిత, పిఆర్ఓ బిఎల్ పి.రావు తదితరులు హాజరైనారు.
సంక్రాంతికి 100 అదనపు బస్సులు :ప్రజా రవాణా శాఖ డిప్యూటీ కమీషనరు జి.వరలక్ష్మి