క్రికెట్ టి20లో ఈ రోజు నరాలు తెగే ఉత్కంట.

సెడాన్ పార్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత్ సొంతమైంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో కోహ్లీసేనను విజయం వరించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది.సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ తరఫున కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్ బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరూ కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17పరుగులు చేశారు. దీంతో 18పరుగుల లక్ష్యంతో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. తొలి రెండు బంతుల్లో మూడు పరుగులే రావడంతో భారత్ విజయంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తర్వాతి బంతికే రాహుల్ ఫోర్ కొట్టాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ తీయడంతో రోహిత్ స్ట్రయికింగ్‌కు వచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండు బంతులనూ సిక్సర్లుగా మలిచిన రోహిత్ జట్టుకు విజయాన్నందించాడు. దీంతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో మరో రెండు మ్యాచులు మిగిలుండగానే కైవసం చేసుకుంది.