అమ్మఒడికి అప్పులా???

అమరావతి : జనవరి 8:అమ్మఒడి పథకానికి అప్పుల మోత మోగుతోంది. రాష్ట్రానికి ఆదాయము, ఆదాయ మార్గాలూ పెరగకపోయినా రూ.వేల కోట్ల అప్పులతో లోటును పూడ్చుతున్నారు. తాజాగా బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.7,428కోట్ల రుణ సమీకరణకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించింది. జనవరి- మార్చి త్రైమాసికంలో వీటిని వాడుకోవచ్చు. రూ.15వేల కోట్లు అప్పు చేసేందుకు అనుమతి కోరుతూ గత డిసెంబరులో కేంద్రానికి రాష్ట్రం లేఖ రాసింది. ప్రజాఖాతా పద్దుల నుంచి చేస్తున్న ఖర్చులకు కారణాలు చెప్పాలని కేంద్రం కోరింది. ఆ వివరాలు సమర్పించినప్పటికీ 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ఐదేళ్లలో చేయగలిగే అప్పుల పరిమితి దాటిపోయింది. ఇక ఏపీకి అనుమతి కష్టమేనని ఆర్థికశాఖ అధికారులు భావించారు. కానీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చొరవతో అప్పులు చేసుకునే వెసులుబాటు లభించిందని సమాచారం. మంగళవారం పొద్దుపోయాక కేంద్ర అనుమతి రావడంతో రాష్ట్ర ఆర్థికశాఖ హుటాహుటిన రూ.3వేల కోట్ల అప్పుకోసం ఆర్‌బీఐని సంప్రదించినట్టు సమాచారం.బుధవారం అధికారికంగా అప్పు దరఖాస్తును ఆర్‌బీఐకి పంపారు. ఆర్‌బీఐని సంప్రదించే సమయానికే గడువు దాటిపోవడంతో నిధుల రాకపై సందిగ్ధం నెలకొంది. అమ్మఒడి ప్రారంభించే గురువారం నాటికి అప్పు రాకపోతే ఓడీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఆపై ఆర్‌బీఐ నుంచి వచ్చే నిధులను ఓడీ చెల్లింపులకు వినియోగించుకోవాలని ఆర్థిక శాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమ్మఒడి లబ్ధిదారులందరికీ ఒకేసారి కాకుండా నిధుల లభ్యతను బట్టి ఒక్కొక్కరి ఖాతాలో జమ అవుతూ ఉంటాయని అధికారులు తెలిపారు. అప్పులిచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొహం చాటేసినా, అధిక వడ్డీ డిమాండ్‌ చేసినా కేంద్రమంత్రి నిర్మలమ్మ దయతో ఊపిరి పీల్చుకున్నామంటున్నారు. కాగా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు 8.5శాతం వడ్డీకి రూ.1500కోట్లు అప్పు ఇచ్చేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న ఆం రఽధాబ్యాంకు రూ.900కోట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.