మరుగుదొడ్లు సత్వరం పూర్తి చేయాలి

శ్రీకాకుళం : జనవరి 10 : అసంపూర్తిగా ఉన్న మరుగు దొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ లతో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంను బహిరంగ మల విసర్జన రహిత(ఒడిఎఫ్) రాష్ట్రంగా ప్రకటించడం జరిగిందన్నారు. దేశంలో 550 జిల్లాల్లో ఓడిఎఫ్ ప్రకటించారని, అందులో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో నిర్మాణాలు పూర్తి స్థాయిలో లేవని సర్వేలలో తేలిందని ఆయన చెప్పారు. లెక్కలకు అనుగుణంగా వాస్తవ పరిస్థితులు ఉండాలని సూచించారు. త్వరలో జరిగే 2021 జనాభా గణనలో జనాభాతో పాటు మరుగుదొడ్ల పరిస్థితి తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. మార్చి నాటికి గ్యాప్ ఫిల్లింగ్ జరగాలని, అందుకు 100 రోజుల ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 30 నుండి 40 శాతం వరకు గ్యాప్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఆయన చెప్పారు. ఏ ఒక్క ఇల్లు మరుగు దొడ్డి లేకుండా ఉండరాదని పేర్కొన్నారు. ఓడిఎఫ్ ప్లస్ స్దాయికి వెళ్లాలని అన్నారు.అమరావతి నుండి కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ బరోక, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జె నివాస్, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు, డీపీఓ వి.రవి కుమార్, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.