దిశ సెంటర్ ప్రారంభించిన జిల్లా యస్.పి.అమ్మిరెడ్డి,కలెక్టరు నివాస్.

శ్రీకాకుళం : రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన దిశ సెంటర్ ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ బుధవారం ఉదయం సందర్శించారు. దిశ సెంటర్ లో బాధితులకోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనివిధంగా దిశ పేరుతో ఒక ప్రతిష్టాత్మకమైన చట్టాన్ని అమలు చేసినట్టు తెలిపారు. కేసు త్వరితగతిన పరిష్కరించేందుకు ఒక ఫోరెన్క్ లేబు, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన వారికి మెడికల్ టెస్టు, కౌన్సిలింగ్, ఒక లాయరు, మహిళా ఎస్.ఐ. పారా మెడికల్ సిబ్బంది ఉంటారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన వారికి 15 రోజులు ఉండి ట్రీట్మెంటు పొందేందుకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. జిల్లా కోర్టు ఆవరణలో ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చెస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మహిళా పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ గా మార్చి కేసులు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. అసుపత్రికి వచ్చే బాధితులకు తక్షణ సహాయం అందజేసేలా దిశ సెంటర్ పనిచేస్తుందని చెప్పారు.బాధితులకు వైద్య సహాయం అందించడమే కాకుండా ఫిర్యాదు తీసుకొని జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. బాధుతులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఆర్దిక సహాయం అందేలా ఇక్కడ సిబ్బంది చర్యలు తీసుకుంటారని అన్నారు.జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమ్మిరెడ్డి మాట్లాడుతూ దిశ సెంటరులో కూడా ఫిర్యాదులను పోలీసు సిబ్బంది స్వీకరిస్తారని చెప్పారు. ఆయా పోలీసు స్టేషన్లకు సమాచారం అందజేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పి.డి. జయదేవి, రిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.