శ్రీకాకుళం : ఇ కర్షక్ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గురు వారం సారవకోట మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ సారవకోట మండల రెవిన్యూ అధికారి కార్యాలయం నుండి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇ కర్షక్ కార్యక్రమంను వ్యవసాయ శాఖ వేగవంతం చేయాలని, వారంలో సమగ్రమైన కార్యాచరణ తయారు కావాలని అన్నారు. రైతులకు అవగాహన కల్పించడం వలన ఇ కర్షక్ లో చేరి ఉచిత బీమా పొందుటకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అన్నారు. ధాన్యం నిల్వకు గిడ్డంగుల సమస్య ఉండకుండా టెండర్లు పిలిచామని చెప్పారు. ఉగాది నాటికి ఇళ్ళ పట్టాలను జారీ చేసే కార్యక్రమంలో భాగంగా గృహ లే అవుట్ల తయారీకి జేసీబిలు అధికంగా పెట్టాలని ఆదేశించారు.శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు స్థలాలను ఎంపిక చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో 35 కేంద్రాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదని, తక్షణం ప్రారంభించాలని పేర్కొన్నారు. గిడ్డంగుల సమస్య తీరనుందని, దగ్గరలోని గోడౌన్ లను పరిశీలించి ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని సూచించారు. తూకంలో తక్కువ వస్తుందని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. వీటిని అధిగమించుటకు మిల్లుల వద్ద విఆర్ఓ లను పెట్టాలని అన్నారు. గోనె సంచులు మిల్లర్లు తెస్తున్నారా, రైతు తెస్తున్నారా గమనించాలని, రవాణా చార్జీలు రైతు పెట్టారా, మిల్లరు పెట్టారా అనేది పక్కాగా విఆర్ఓ రాయాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యానికి విధిగా మద్దతు ధర చెల్లించాలని స్ఫష్టం చేసారు. 1075 రకం ధాన్యం విధిగా తీసుకోవలసిందేని పేర్కొన్నారు. 1075 రకం తీసుకోని మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే వినతులలో భూసమస్యలు, పౌర సరఫరాలు తదితర విషయాలపై నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని అన్నారు. బియ్యం కార్డుల జాబితా 26వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కు గ్రామాల్లో ప్రదర్శించాలని చెప్పారు. అర్హుల జాబితా, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి జాబితా, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి జాబితాలు ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బియ్యం కార్డులు జారీ అవుతాయని జెసి పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్సులో ఐటిడిఏ పిఒ సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, ఆర్డీవో ఎం.వి.రమణ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు, జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు, డిపిఓ వి.రవి కుమార్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇ కర్షక్ పై రైతులకు అవగాహన కల్పించాలి