ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ లోనిదే దీనిని అభివృద్ధి చేయడం మనముందున్న లక్ష్యం : కృష్ణదాస్

నరసన్నపేట : ఏ పదజాలం వెనక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉందో తెలుసుకో లేనంత వరకు ప్రజల మోసపోతూనే ఉంటారన్నాడు  సోషలిస్టు సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యా నేత లెనిన్.ఏ మీడియా కథనం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉందో  తెలుసుకో లేనంత వరకు పాఠకులు, ప్రజలు  మోసపోతూనే ఉంటారని అనుకుంటున్నాను నేను అని చమత్కరించారు రోడ్లు భవనాల శాఖామాత్యులు దర్మాన కృష్ణదాస్.పరిపాలన రాజధాని కోసం ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేయలేదు అన్న విషయం 13 జిల్లాల వాళ్ళు తెలుసుకోవాలని నా విన్నపం.రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనల ప్రకారం బాధ్యతగల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు.ఒక వర్గ ప్రయోజనం కోసం కూడా ఆయన అమరావతిని ఎంపిక చేయలేదు.అపోహ పడుతున్న వారు కూడా ఈ వాస్తవాన్ని గమనించాలి.తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం, నారాయణ లాంటి పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, వారి బినామీల ప్రయోజనాల కోసం శివరామకృష్ణన్ కమిటీకి సహకరించకుండా, సమాచారం ఇవ్వకుండా అవమానించి, వాళ్ళేదయితే అనుకున్నారో దాని ప్రకారమే నిర్ణయం తీసుకున్నారు.దానికి 
భూసేకరణ ( ల్యాండ్ అక్విజిషన్) అనే ప్రక్రియ పక్కనపెట్టి, భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అన్నారు. రైతుల్ని బలవంతం చేశారు. భయభ్రాంతులను చేసారు. రైతుల మోటారు కనెక్షన్లు కట్ చేశారు. పంటలను తగలబెట్టిన చారు. ఈరోజు ఆందోళన చేస్తున్న గ్రామాల వారికి ఇవన్నీ తెలియనివా? తెలుసు అందుకే నేనంటాను ఇది ఒత్తిడితో చేయిస్తున్న ఉద్యమమని.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శివరామకృష్ణన్ కమిటీ నివేదికను సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే మూడు రాజధానుల ప్రతిపాదన పట్ల మొగ్గు చూపారని అనుకుంటున్నాను. ఈ అభిప్రాయంలో ఎటువంటి రాజకీయ వ్యూహం లేదని, ఏ సామాజిక వర్గం పట్ల ఆయనకు వ్యతిరేకత లేదని నూటికి నూరుపాళ్లు నేను నమ్ముతున్నాను. విశాఖపట్టణంను పరిపాలన రాజధానిగా, అమరావతి శాసనసభ వ్యవహారాల రాజధానిగా, కర్నూలును న్యాయ రంగ రాజధానిగా నిర్ణయించడం వల్ల తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ పాలన వికేంద్రీకరణకు దోహదపడుతుంది. ఇది అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి దారులు తీస్తుంది. విశాఖ మహానగరాన్ని చూసి కొందరు ఉత్తరాంధ్రకు ఏమి లోటు ఉందని అనుకోవచ్చు. కానీ నగరాన్ని దాటి చూడాలని ఆ నగరం అందం వెలుపల ఉన్న ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని చూడాలని, ఇది దీపం కింద చీకటిని గమనించాలని కోరుతున్నాను.చిన్న కమతాలు. ( అంటే అరెకరం లోపల ఉన్న మడి చెక్కలు) రైతుల పేదరికానికి సూచికలు. రాష్ట్రంలో ఈ చిన్న కమతాలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఏడాది పొడవునా ప్రవహించే జీవనదులు లేని ప్రాంతం కూడా ఉత్తరాంధ్రనే.ఇక్కడ చిన్న మధ్య తరహా నదులు 12 వరకు ఉన్నాయి. 1905 లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు ఒక్కటే 1960 వరకూ సాగు నకు ఆధారం.స్వాతంత్రం వచ్చిన తర్వాత 18 ఏండ్ల వరకు ఉత్తరాంధ్ర వైపు ఏ ప్రభుత్వమూ కన్నెత్తి చూడలేదు.1965లో నాగావళి నదిపై నారాయణపురం ఆనకట్ట. మహేంద్రతనయ నదిపై పైడిగాం ఆనకట్ట. నిర్మాణం జరుపుకున్నాయి.  రాష్ట్ర విభజనతో వచ్చే బాధ,  కష్టం అంటే ఏంటో మొదటిసారి తెలుసుకున్నది ఉత్తఱాంధ్రానే. 1937 ఏప్రిల్ 1న ఒడిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో జగదల్పూర్ వరకు విశాఖపట్నం లోనే కలసి వుండేది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రవహిస్తున్న నదీ మూలాలన్నీ అక్కడే ఉన్నాయి.  ఆ ప్రాంతం ఇప్పటికీ విశాఖ జిల్లాలోనే ఉండి ఉంటే ప్రస్తుతం నదీజలాల వినియోగంలో ఎలాంటి వివాదాలు ఉండేవి కాదు.కొత్తగా ఏర్పడిన చత్తీస్ఘడ్ రాష్ట్రం దాదాపు గిరిజన రాష్ట్రం. అక్కడ 12 గిరిజన తెగలు ఉన్నాయి. అదే ఒక్క ఉత్తరాంధ్ర లోనే 17 గిరిజన తెగలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్నది కూడా ఉత్తరాంధ్రలోనే. ఆదివాసీల నివాస ప్రాంతం కూడా ఉత్తరాంధ్రాలోనే ఉంది. విద్య, వైద్యం, సురక్షితమైన తాగునీరు, స్థిరమైన సాగునీరు, రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు లేని గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వరి అన్నం అంటే ఏంటో తెలియని గిరిజన గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా?? కొండల శిఖరాలనుంచి, డోలిల్లో  గర్భవతుల ను తీసుకొని వస్తున్నప్పుడు దారిలోనే ప్రసవాలు జరిగిపోతూవుంటాయి. తల్లి బతుకుతుందా? బిడ్డ బతుకు తుందా? గ్యారెంటీ లేదు! బాలింతలు, శిశువుల మరణాల శాతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉత్తరాంధ్ర దే అగ్రస్థానం.వ్యవసాయం, వైద్యం, సేవ, వివిధ సామాజిక రంగాల వృత్తుల్లో, తలసరి ఆదాయంలో చివరి స్థానాలన్నీ  ఉత్తరాంధ్రవే. అడ్డు గుండార  నుంచి, అర్ధనగ్న దేహాల నుంచి,ఉత్తరాంధ్ర కూడా నాగరికత సమాజంలో కలిసి నడవాలనుకుంటోంది. అవకాశమివ్వండి. ఆహ్వానించండి.పరిపాలన రాజధాని విశాఖపట్నం అయితే.....! ముఖ్యమంత్రి, మంత్రులు, బూరాక్రాట్లు ప్రత్యక్షంగా పదే, పదే మా కష్టాలను కన్నీళ్లను చూస్తారని మా అభివృద్ధికి మనస్ఫూర్తిగా పని చేస్తారని మా ఆశ.'దేశమును ప్రేమించుమన్నా' అన్నాడు ఉత్తరాంధ్రాలో పుట్టిన ఆ మహాకవి గురజాడ. చంద్రబాబు గారూ ద్వేషమును విడనాడన్నా అని నేను అంటున్నాను. మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు మన గురజాడ.మీరు కూడా ఆ దిశగా ఆలోచించాలి అంటున్నాను.దేశమంటే మట్టికాదోయ్ అన్నాడు ఆనాడు గురజాడ. రాష్ట్రమంటే ఒక్క అమరావతి కాదు అంటున్నాను నేను. దేశమంటే మనుషులు అన్నాడు మన  గురజాడ. ఉత్తరాంధ్ర లో కూడా మనుషులు ఉన్నారే అంటున్నాడు ఈ దాసన్న,. 
సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్చామి బుద్ధుని వెనకే పెట్టుకొని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఆయన బోధనలను అనుసరించడమే అసలైన ధర్మం.