మద్యం మత్తులో ప్రాణం మీదకు తెచ్చుకున్న వ్యక్తి

రాజస్థాన్ :  ఓ పెద్ద నల్లత్రాచు పూటుగా మద్యం సేవించిన ఒక మందుబాబు కంట పడింది. మత్తులో బాగా జోగుతున్న అతడు పాము వెనుకే ఉరికి దాన్ని ముట్టడించి ఎటూ పోకుండా సుమారు ఒక అర్ధగంట సేపు అలానే దాంతో పరాచకం ఆడాడు. కానీ ప్రాణాలను నిమిషాల్లో తీసే విషం కలిగి ఉన్న ఆ పెద్ద పాము అతడిని చంపలేకపోయింది. అసలు ఏమిటీ మందుబాబు కథాకమామిషు ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో మద్యం తాగిన వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా ఓ పెద్ద నల్లత్రాచు పాముతో ఆడుకున్నాడు. ఈ అరుదైన సంఘటన గురించి తెలుసుకున్న సమీప ప్రజలు మందుబాబు చేష్టలను చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడికి చేరుకున్న తరువాత, వారు ఏమి చూస్తున్నారో వారు నమ్మలేకపోయారు. అయితే, పాము భయంతో ఎవరూ ఈ తాగుబోతు దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు.
అయితే, కొంతమంది ఈ మందుబాబు చేష్టలను వీడియో రికార్డు చేసి నెట్టింట షేర్ చేశారు. దాంతో ప్రస్తుతం ఒక 30నిమిషాల నిడివిగల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియోలోని వ్యక్తిని ప్రకాష్ మహావర్ అని గుర్తించారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని గురకట్ల గ్రామంలో జరిగింది. ప్రకాష్ తనకు కనిపించిన ఒక నల్లత్రాచు పామును వెంబడించి పట్టుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
విచిత్రమైన సంఘటనను దర్శించిన వారు మాట్లాడుతూ.. ప్రకాష్ పామును తన మెడలో వేసుకోవడానికి కూడా ప్రయత్నించాడని చెప్పారు. సుమారుగా అరగంట పాటు జరిగిన ఈ డ్రామాలో... పాముతో పరాచికాలు ఆడుతున్న సమయంలో, ప్రకాష్ ని సర్పం అనేకమార్లు కాటు వేసింది.
దాంతో అతడు కుప్పకాలిపోయాడు. ఆ తరువాత వీడియో ముగుస్తుంది. అయితే, పాము కాటు కారణంగా జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చేరాడని పోలీసులు తెలిపారు. ఏదేమైనా, పోలీసులకు వీడియో ముగిసిన వెంటనే ప్రకాష్ కి ఏమి జరిగిందో, అతను ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో ఖచ్చితంగా తెలియకపోవడంతో అదే వ్యక్తి ఇదే వ్యక్తా కాదా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు త్వరలోనే ఆ వ్యక్తిని కనుగొంటారని చెబుతున్నారు. అయితే, ఈ మందుబాబు చిత్రహింసల వలన ఆ నల్లత్రాచు మరణించిందని స్థానికులు చెబుతున్నారు.