సమత లైంగిక దాడి దోషులకు ఉరిశిక్ష

హైదరాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత లైంగికదాడి కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులు ముగ్గురికీ ఉరి శిక్ష విధించింది.  ఈ కేసులో షేక్ బాబు,షేక్ షాబుద్ధీన్, సేక్ మక్దూంలకు మరణశిక్షే సరైనదని తీర్పు ఇచ్చింది. కాగా ఈ నెల 27నే తీర్పు వెల్లడి కావాల్సి ఉండగా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండడంతో తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో గతేడాది నవంబర్ 24న సమత లైంగికదాడి ఘటన చోటుచేసుకుంది. సమతను ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక లైంగికదాడి చేసి హత్య చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ పూర్తయింది. నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సేవాధికార సంస్థ తరఫున కోర్టు న్యాయవాదిని సమకూర్చింది. ఈ కేసులో నిందితులు షేక్ బాబు, షాబుద్దీన్, ముగ్దుమ్‌ కోర్టుకు చేరుకున్నారు. అలాగే, సమత కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానానికి చేరుకున్నారు. న్యాయస్థానం వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు మొత్తం 25 మంది సాక్షులను విచారించింది. తుది తీర్పు నేపథ్యంలో దోషులను న్యాయవాది పలు ప్రశ్నలు అడిగారు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దోషులు న్యాయమూర్తి ముందు బోరున విలపించారు.