అమరావతి: ఏపీ శాసన మండలి రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మండలి రద్దుపై సీఎం జగన్ శాసనసభలో ఈరోజు ఉదయం తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు దానిపై చర్చించారు. చర్చలో పాల్గొన్న సభ్యులంతా మండలి రద్దుకే మొగ్గు చూపారు. చివరిగా సీఎం జగన్ చర్చలో పాల్గొని మండలి రద్దు తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే కారణాలను వివరించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఈ తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరారు. సభ్యులంతా లేచి నిలబడగా శాసనసభ సిబ్బంది లెక్కించి అనుకూలంగా 133 మంది ఉన్నట్లు తేల్చారు.తటస్థంగా, వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు తమ్మినేని సీతారామ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం.