అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణకు మాకు అభ్యంతరం లేదు.కానీ రాజధాని మార్పును మాత్రం ఒప్పుకోము అని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అమరాతి మార్పుపై ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో యనమల విమర్శలు గుప్పించారు. కోర్టులు చివాట్లు పెట్టిన ప్రభుత్వానికి జ్ఞానోదయం కావట్లేదన్నారు. అధికార పార్టీ చేసేదానికి తాము అడ్డుకొని తీరుతామన్నారు. సీఆర్‌డీఏ బిల్లును ఆర్థిక బిల్లుగా తీసుకురావడం సరికాదని చెప్పారు. సీఆర్‌డీఏ అనేది ప్రత్యేక చట్టమని తెలిపారు.మరో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ ‘‘రాజధాని తరలింపు బిల్లు ఏ రూపంలో వచ్చినా మండలిలో ఆమోదం పొందదు. మండలిలో తెదేపాతో పాటు భాజపా, వామపక్షాలు, ఉపాధ్యాయ, అధ్యాపక ఎమ్మెల్సీలు అందరూ రాజధాని తరలింపునకు వ్యతిరేకమే. మండలి రద్దు చేస్తామనే బెదిరింపులకు తలొగ్గం. ప్రభుత్వం కొందరు ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేసే యత్నం చేస్తోంది. ఎన్ని కుట్రలు పన్నినా మండలిలో బిల్లు వీగిపోక తప్పదు’’అని అన్నారు.టీడీఎల్పీ ఉపనేత బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజధాని రైతుల హక్కుల కోసం అసెంబ్లీలో మా పోరాటం ఉంటుందన్నారు. సంఖ్యాబలం ఉంది కదా అని మూర్ఖంగా ముందుకెళ్లినా న్యాయవ్యవస్థ ఉందని ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. రాజధాని రైతుల కోసం న్యాయపోరాటమూ చేస్తామని తెలిపారు.
రాజధాని బిల్లును అడ్డుకొంటాం : తెదేపా నేతలు