విశాఖ : ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులుంటాయని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామంటూ జగన్ సర్కారు ప్రతిపాదించిన ఎత్తుగడకు ప్రతిపక్ష పార్టీలు చిత్తవుతున్నాయి. ఇప్పటికే టీడీపీలో నేతలు ప్రాంతాలవారీగా విడిపోయి భిన్నప్రకటలు చేస్తుండం చూస్తున్నాం. మూడు రాజధానుల ప్రతిపాదనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బీజేపీలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. మరో 10 కమిటీలు వేసినా జరగబోయేది ఇదేనంటూ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆదివారం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలకే షాకిచ్చేలా ఉన్నాయి.
మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ రాజకీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒక రాజధానినే కట్టలేని ఆయన.. మూడు రాజధానులెలా కడతారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గతంలో నిలదీశారు. రాజధానిని అమరావతి నుంచి మార్చితే కేంద్ర ఒప్పుకోదని, ఒకవేళ అలా చేస్తే కేంద్రానికి భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ సుజనా చౌది చెప్పారు. తర్వాత నేతలందరూ తలోమాట చెప్పుకొచ్చారు. వాళ్లందరికీ కౌంటరిస్తూ విష్ణుకుమార్ రాజు విశాఖ రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు.
రాజధానుల అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ కమిటీలు కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థించడం.. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సూచించడం చాలా సంతోషకరమని విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖకు ఉన్న అర్హత, ప్రత్యేకత వల్లే అన్ని కమిటీలు సానుకూల రిపోర్టులు ఇచ్చాయన్నారు. అమరావతి వర్సెస్ విశాఖపట్నం అనే పోటీ ఏర్పడితేగనుక రాష్ట్రవ్యాప్తంగా అందరూ విశాఖవైపు మొగ్గుచూపడం ఖాయమని, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదేనని ఆయన తెలిపారు.
విశాఖను రాజధానిగా తీర్చిదిద్దాలని తాను గతంలోనే అసెంబ్లీలో మాట్లాడానని రాజు గుర్తుచేశారు. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తన మాటల్ని పట్టించుకోలేదన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ఎంచుకోవడంపై కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు.రాజకీయాలను పక్కన పెడితే అమరావతి రైతులకు మాత్రం కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని విష్ణకుమార్ రాజు అన్నారు.
బి.జె.పి.లో రాజధాని విషయంలో తలోమాట