శ్రీకాకుళం : జనవరి 5 : శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనం జిల్లాలోనే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రధాన రహదారికి దూరంగా నిర్మించడం వలన సచివాలయానికి వచ్చే ప్రజానీకానికి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉండబోవని, ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణం లభిస్తుందని తెలిపారు. ఆదివారం ఉదయం పెద్దపాడు-2 గాంధీనగర్ కాలనీలో నూతన సచివాలయ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శవంతమైందని, దీనివలన గ్రామప్రజలు తాము ఉన్నచోటే అన్నిరకాల సేవలను పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఇటువంటి వ్యవస్థ కోసం నూతనంగా నిర్మించనున్న సచివాలయ భవనం నాణ్యతతో నిర్మించి జిల్లాలోనే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పెద్దపాడులో రెండు గ్రామ సచివాలయాలు ఉన్నాయని, ఇప్పటికే ఒకటి ప్రారంభం అయిందన్నారు. రెండవది అయిన ఈ సచివాలయం మార్చి నాటికి నిర్మాణం పూర్తికావాలని, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.ఈ భవన నిర్మాణం చూసి నియోజకవర్గంలోని ఇతర భవన నిర్మాణ కాంట్రాక్ట్ పనులు తమకే అప్పగించేలా నిర్మాణాలను చేపట్టాలని కోరారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోనే ఉన్నందున కాంట్రాక్టర్లకు అవసరమైన పనులు తక్షణమే జరుగుతాయని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో సిబ్బంది, వాలంటీర్ల పాత్ర కీలకమని, ప్రజల అవసరాలను తీర్చి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చేలా సిబ్బంది కృషిచేయాలని కోరారు.
ఆదర్శ సచివాలయంగా నిర్మించాలి