విజయవాడ: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో విజయవాడలో పోలీసుల ఆంక్షలు విధించారు. 2500 మంది సిబ్బందితో నగరాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకోనున్నారు. ప్రకాశం బ్యారేజీపై అనుమతితో కూడిన వాహనాలు మినహా.. మిగిలిన వాహనాల రాకపోకలు నిషేధించారు. మరికొన్ని వాహనాలను దారి మళ్లించారు. ప్రకాశం బ్యారేజీపై పాదచారులు వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరించారు. భారీ వాహనాలు విజయవాడ వెలుపలి నుంచే దారి మళ్లించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అత్యవసర వాహనాలకు మాత్రమే బ్యారేజీపైకి పోలీసులు అనుమతిచ్చారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, కనకదుర్గ వారధి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు అంటున్నారు.మరోవైపు అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన నేతలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారికి ముందుగానే నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. విజయవాడ గొల్లపూడిలో ఉంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విద్యాధరపురంలో నివాసం ఉంటున్న సీనియర్ నాయకుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నోటీసు ఇచ్చారు. వారి ఇంటికి ఈ నోటీసులు అంటించారు. జేఏసీ పిలుపు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌తోపాటు 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నట్లు వివరించారు.
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు