విమానం ఎక్కాక వెనక్కి రావాలనుకుని.. తన వద్ద బాంబులు ఉన్నాయని ----

కోల్‌కతా: పూటుగా మద్యం సేవించిన ప్రయాణికురాలు ఒకరు గాల్లో విమానాన్ని పేల్చివేస్తానని బెదిరించడంతో ఎయిర్‌ ఏషియా విమానం తిరిగి విమానాశ్రయానికి వచ్చింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి శనివారం 114 మంది ప్రయాణికులతో విమానం ముంబయి బయలుదేరింది. అనంతరం కొద్దిసేపటికే ఓ ప్రయాణికురాలు వెనక్కి రావాలని భావించింది. విమాన సిబ్బంది ఒకరిని పిలిచి పైలట్‌కు ఇవ్వాల్సిందిగా చిన్న కాగితాన్ని చేతిలో పెట్టింది. ‘‘నా శరీరం చుట్టూ బాంబులు ఉన్నాయి. ఎప్పుడైనా వాటిని పేల్చేస్తాను’’ అని అందులో ఉంది. అప్రమత్తమైన పైలట్‌ ఏటీసీని ఆశ్రయించగా.. వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. అనంతరం విమానం కిందకు దిగిన వెంటనే ప్రత్యేక ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని పరిశీలించారు. ఎక్కడా బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.