శ్రీకాకుళం : జనవరి 24: ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన క్రిష్ణ దాస్ పేర్కొన్నారు.శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు ఐ.సి.డి.ఎస్. ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ సూర్యా మహల్ కూడలి వరకు భారీ ఎత్తున జరిగింది. పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్ధులు, ఐసిడిఎస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేసారని, మహిళల రక్షణకోసమే దిశ చట్టాన్ని చేయడం జరిగిందని తెలిపారు.మహిళలను వేధించిన వారికి సత్వరంగా శిక్షను అమలు చేయడానికి, అత్యాచార బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019 చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఇందు నిమిత్తం అమ్మఒడి పథకం, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటి ప్రజా ప్రయోజనకర పథకాలను రూపొందించడం జరిగిందన్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృధ్ధి పరచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలు, మహిళలల రక్షణ కోసమే దిశ చట్టాన్ని చేయడం జరిగిందన్నారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడం, నేరస్ధులకు 21 రోజులలోగా శిక్షణను అమలు చేయడమే దిశ చట్టం వుద్దేశ్యమన్నారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్ ను దిశ కేంద్రంగా మార్చడం జరిగిందని, న్యాయ సహాయం, వైద్య సేవలు, పోలీసు సేవలన్నీ ఒకే దగ్గర పొందే వెసులుబాటు దిశ కేంద్రంలో కలగుతుందన్నారు. సోషల్ మీడియోలో మహిళలు, బాలికలపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష వుంటుందని, రెండవ సారి పోస్టింగ్ చేసినట్లయితే అదనంగా 2 సంవత్సరాలు శిక్ష వుంటుందని చెప్పారు.ర్యాలీలో భాగంగా బాలికల రక్షణపై మంత్రి క్రిష్ణ దాస్ ప్రతిజ్ఞ చేయించారు. బాలికల రక్షణ, దిశ చట్టాల పోస్టరును విడుదల చేసారు. మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దిశ చట్టం బ్యానర్ పై మంత్రి క్రిష్ణదాస్, జిల్లా కలెక్టర్ నివాస్ తదితరులు సంతకాలు చేసారు.దిశ కేంద్రం ఎ.ఎస్.ఐ. అరుణకుమారి, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు కె. సత్యవాణి., హనుమంతు కిరణ్ కుమార్, సుగుణా రెడ్డి, వివిధ కళాశాల విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మహిళల రక్షణకు ప్రాధాన్యత : మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్