ప్రతి జోన్‌కో కమిషనర్
‘రాజధాని’ రద్దుకు సర్కారు రెడీ
ఆ ఊసే లేకుండా పాలన విభజన!
ప్రతి కీలక శాఖకూ జోనల్ విభాగం
అధికార వికేంద్రీకరణపై కసరత్తు
యూపీ ‘డివిజన్ల’ మోడల్‌పై దృష్టి
రేపటి అసెంబ్లీ భేటీలోనే బిల్లు
సీఆర్‌డీఏ రద్దు బిల్లు కూడా?
ఏ జోన్‌లో ఏ జిల్లా?
జోన్ జిల్లాలు
ఉత్తర కోస్తా - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ
మధ్య కోస్తా- ఉభయగోదావరి, కృష్ణా
దక్షిణ కోస్తా- గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రాయలసీమ- కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు
అమరావతి : జనవరి 18 : ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజధాని’ రద్దు కాబోతోంది! రాజధాని కేంద్రంగా జరగాల్సిన పరిపాలనను సంపూర్ణంగా వికేంద్రీకరించి.. ప్రజలకు రాజధానితో సంబంధమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని డివిజన్ల తరహాలో నవ్యాంధ్రను కూడా నాలుగు జోన్లుగా విభజించాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి.. ప్రతి జోన్‌లో ప్రతి కీలక శాఖకు చెందిన జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టినట్లు పేర్కొన్నాయి. సచివాలయంతో సంబంధమున్న విధానపరమైన నిర్ణయాలు కాకుండా.. ప్రజా వినతులు, సమస్యలు, ఉద్యోగుల కోర్కెలు తదితరాలన్నీ కమిషనరేట్లలోనే పరిష్కారమైపోతాయని తెలిపాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి. పాలనాసౌలభ్యం కోసం వీటన్నిటినీ 18 డివిజన్లుగా విభజించి.. డివిజనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.
ఇదే మోడల్‌పై సీఎం జగన్ దృష్టి సారించారు. జోనల్ వ్యవస్థపై సోమవారం ఉదయం జరిగే మంత్రివర్గ భేటీలో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన కార్యాచరణను వెల్లడిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజధాని నగరంతో ప్రజలకు సంబంధమే లేకుండా చేయడమే సీఎం ఉద్దేశమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించేస్తే రాజధానిపై వారిలో సెంటిమెంటు ఉండదని భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని సమాచారం. దీనిప్రకారం.. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లు ఏర్పాటవుతాయని తెలిసింది.
సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లును తీసుకురాబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోమవారం ఉదయం జరిగే కేబినెట్ సమావేశంలో.. సీఆర్‌డీఏ చట్టంలో మార్పులూ చేర్పులూ చేస్తూ.. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి పట్టణాభివృద్ధి సంస్థకు అధికారాలు బదలాయిస్తూ బిల్లు తీసుకురానున్నట్లు ఓ మంత్రి తెలిపారు. సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఏవి ఎక్కడ అనేది ఇలా....
అమరావతిలో అసెంబ్లీ (వర్షాకాల, శీతాకాల సమావేశాలు మాత్రమే), హైకోర్టు బెంచ్.
విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.
కర్నూలులో హైకోర్టు, న్యాయ పరిధిలోని సంస్థలన్నీ..
రాజధాని కేంద్రీకృతం కాకుండా..
చట్టసభలు, పరిపాలన, న్యాయ రాజధానుల విభజనతో పాటు.. జోనల్ కమిషనరేట్ల ఏర్పాటు ద్వారా.. రాజధాని ఒకే చోట కేంద్రీకృతమై ఉందన్న అభిప్రాయాన్ని లేకుండా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాలనా రాజధానిగా విశాఖ ఉంటే.. రాయలసీమ జిల్లాలు.. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు దూరాభారమవుతుందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. జోనల్ విధానం తేవాలని ఆయన భావిస్తున్నారని అంటున్నాయి.
కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు ఏమడిగారు..?
పాలనా రాజధానిని తరలిస్తున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. కొల్లేరు అభయారణ్యం అభివృద్ధి.. హైదరాబాద్-విజయవాడ- చెన్నై-కోల్‌కతా రహదారితో అమరావతి ప్రాంతం అనుసంధానం.. వైకుంఠపురం బ్యారేజీని పూర్తి చేసి.. కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు..
వంటివి చేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా చిన్నఅవుటుపల్లి నుంచి విజయవాడ వరకూ జాతీయ రహదారి విస్తరణ, హైదరాబాద్-చెన్నై రహదారి అమరావతికి అనుసంధానం.. రాజధాని గ్రామాల్లో నాలుగు వరుసల రోడ్లు వేస్తే తమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.