మద్దిలపాలెం : పరిపాలన వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఏయూ అకడమిక్ డీన్ ఆచార్య కె వెంకటరావు అన్నారు. వైఎస్‌ఆర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పరిపాలన వికేంద్రీకరణ పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి సిఎం చొరవ చూపిస్తున్నారన్నారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖను రాజధానిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఏయూలోని టిఎల్‌ఎన్ సభా హాల్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ ఆవశ్యకతను తెలియజేయడానికి సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు.సదస్సుకు పరిశోధకులు, విద్యార్థులు హాజరవ్వాలని కోరారు. విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బి కాంతారావు మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు శాసనమండలిలో అడ్డుకోవడం దారుణమన్నారు. ఆయన ఎన్ని కుయుక్తులు చేసినా సీఎం జగన్ విశాఖ రాజధాని ఏర్పాటు చేసి తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం ఎయు శాఖ అధ్యక్షులు బి మోహన్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి ఎం కళ్యాణ్, విద్యార్థి నాయకులు సిహెచ్ క్రాంతి కిరణ్, సాయి కృష్ణ, నిషేక్, ఆశిష్, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పరిపాలనా వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర అభివృద్ధి : ఆచార్య వెంకటరావు