ఎం.ఇ.ఓలకు మాస్టర్ కోచ్ నాయకత్వ శిక్షణ

శ్రీకాకుళం : జనవరి 4 : విద్యా వ్యవస్ధలో విప్లవాత్మక మార్పులకు నాయకత్వ శిక్షణ దోహదపడాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్ధ విద్యా శాఖ సౌజన్యంతో విద్యా శాఖలో స్టేట్ ట్రాన్స్పర్మేషన్ ప్రాగ్రాం కార్యక్రమం క్రింద మండల విద్యా శాఖ అధికారులకు మాస్టర్ కోచ్ నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుటకు సంకల్పించింది. కైవల్య సంస్ధ ఇప్పటికే ఎచ్చెర్ల, పలాస, మెళియాపుట్టి మండలాల్లో స్టేట్ ట్రాన్స్పర్మేషన్ ప్రాగ్రాం కార్యక్రమాన్ని ప్రారంభించింది. కైవల్య సంస్ధ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ నివాస్ ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శని వారం కలసి తమ సంస్ధ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కైవల్య ఫౌండేషన్ రాష్ట్ర ప్రతినిధి పరస పురుషోత్తం, ప్రాగ్రాం మేనేజర్ గాడి హరి సువర్చల తమ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ 14 రాష్ట్రాల్లో విద్యా వ్యవస్ధలో మెరుగుకు స్కూల్ లీడర్ షిప్ డెవలప్మెంట్ ప్రాగ్రాం (ఎస్.ఎల్.డి.పి), డిస్ట్రిక్ట్ ట్రాన్స్పర్మేషన్ ప్రాగ్రాం (డి.టి.పి), స్టేట్ ట్రాన్స్పర్మేషన్ ప్రాగ్రాం (ఎస్.టి.పి), గాంధీ ఫెలోషిప్, వర్చువల్ ఫీల్డ్ సపోర్టు తదతర కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎచ్చెర్ల, మెళియాపుట్టి, పలాస మండలాల్లో నాయకత్వ లక్షణాలపై కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. మాస్టర్ కోచ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు సంబంధిత వర్గాలతో విద్యాపరమైన అంశాలను మెరుగుపరచడంలో చక్కని సంబంధాలు కొనసాగించడం, సమస్య పరిష్కారం, ప్రణాళికాబద్ధమైన వ్యూహరచన, ప్రతిస్పందన తెలుసుకొనుట తదనుగుణంగా మెరుగుపరచు కార్యక్రమాలను చేపట్టడం దీని ఉద్దేశ్యమని వివరించారు. మంచి శిక్షణ ఇవ్వడంలోను, అహింసాయుత కమ్యూనికేషన్ విధానాలలోను, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణలోను, వాస్తవ రూపాలను చూపించి విద్యాబోధన చేయడంలోను నైపుణ్యాలను అందించడం జరుగుతుందని తెలిపారు. మాస్టర్ కోచ్ కార్యక్రమం 13 జిల్లాల్లో 51 డివిజన్లలో చేపడుతున్నామని, ఇందులో 671 మంది మండల విద్యా శాఖ అధికారులకు నాయకత్వ లక్షణాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మూడు మండలాలకు మాత్రమే పరిమితం కాకుండా మిగిలిన మండల విద్యా అధికారులకు కూడా మాస్టర్ కోచ్ నాయకత్వ లక్షణాలపై శిక్షణ నిర్వహించాలని సూచించారు. మాస్టర్ కోచ్ నాయకత్వ శిక్షణకు తగిన సహాయ సహకారాలు అందించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు లీడ్ డి.సాయిరూప తదితరులు పాల్గొన్నారు.