పాలకొండా నీదారెటు?!

అరకు జిల్లాలో చేరనుందా?


 'శ్రీకాకుళం' నుంచి విడిపోనుందా?


సర్వత్రా ఆసక్తికరమైన  చర్చ ప్రజలలో నడుస్తుంది.


శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ శాసనసభ నియోజకవర్గం విడిపోతుందా?


కొత్తగా ఏర్పాటు చేస్తారంటున్న 'అరకు' జిల్లాలో విలీనం అవుతుందా?


రాష్ట్రంలో తొలిదశలో ఏర్పాటు చేస్తారంటున్న మూడు జిల్లాల ప్రతిపాదన పట్టాలెక్కితే అదే జరుగుతుందా?


- ఇప్పుడు అంతటా ఇదే చర్ఛ ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తామని వైకాపా ఎన్నికల ప్రణాళికలో చేర్చడం.. శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న 'పాలకొండ' శాసనసభ నియోజవకర్గం అరకు పార్లమెంటు పరిధిలో ఉండటంతో సహజంగానే ఈ చర్చకు ప్రాధాన్యం చేకూరుతోంది.


అరకు' జిల్లా ఏర్పాటుపై జిల్లా అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. అరకు లోక్‌సభ స్థానం పరిధి విస్తృతంగా ఉండటంతో ఇతర పార్లమెంటు నియోజకవర్గాలను ఏర్పాటు చేసినట్లుగా.. ఈ స్థానాన్ని ఒకే జిల్లాగా ఏర్పాటు చేయడం సాధ్యమా అనేది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. నిడివి దృష్ట్యా 'పాలకొండ' విలీనానికి అవకాశాలు తక్కువేనన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.


రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు బాటలు పడుతున్నాయనే విషయం ప్రచారంలోకి వచ్చింది. అరకులో వైద్య కళాశాలను మంజూరు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. బాగా వెనకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే.. అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకు భారత వైద్య మండలి (ఎంసీఐ) సమకూర్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి దశలో మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు భావిస్తున్నారు.


ఇక మిగిలేది అవేనా!


పార్లమెంటు నియోజకవర్గాల పరిధి మేరకు జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనతో శ్రీకాకుళం జిల్లా కొత్తగా ఏర్పాటయ్యే మూడు జిల్లాల పరిధిలోకి విస్తరించే అవకాశాలు ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో ఉన్నాయి. ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలోనూ.. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం అరకు లోక్‌సభ స్థానం పరిధిలోనూ విస్తరించాయి. ఈ క్రమంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిని ఒక జిల్లాగా చేస్తే.. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గాలు మాత్రమే ఈ జిల్లాలో మిగిలే అవకాశం ఉంది.


అలాగా...ఇలాగా?


శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి.. ఈ నాలుగు జిల్లాల్లో అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తరించి ఉంది. ఈ పార్లమెంటు నియోజవకర్గ ఎంపీ స్థానం గిరిజన వర్గాలకు కేటాయింపయింది. దీని పరిధిలోని పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేల స్థానాలూ ఆ వర్గం కిందనే ఉన్నాయి. ఒక్క పార్వతీపురం నియోజకవర్గం మాత్రం ఎస్సీ కేటగిరీలో చేరింది. ఒకవైపు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నుంచి మరో వైపు శ్రీకాకుళం జిల్లా భామిని మండలం వరకు అరకు పార్లమెంటు స్థానం విస్తరించి ఉంది. రమారమి 500 కి.మీ విస్తరించి ఉండటంతో.. ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే ప్రక్రియ చేపట్టినప్పటికీ.. 'అరకు' పార్లమెంటు నియోజకవర్గానికి మాత్రం ఇది సరైనది కాదని గతంలోనే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతగా విస్తరించాలనుకుంటే.. పార్వతీపురం లేదా కురుపాం వరకు విస్తరణను సరిపెట్టొచ్చన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. అసలు పార్లమెంటు నియోజకవర్గాన్నే పరిగణనలోకి తీసుకోకుండా.. భౌగోళిక స్వరూపాన్ని ప్రామాణికంగా తీసుకుని పాడేరు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లతోనే అరకు జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశాలూ లేకపోలేదన్న అంశాలపై అధికారిక వర్గాలో విస్తృతంగా చర్చనీయాంశలవుతున్నాయి. ఇలా చేసినా.. విశాఖలో జిల్లాలో సగ భాగం వరకు అందులోనే ఉంటుందని చెబుతున్నారు. పార్వతీపురం, కురుపాం వరకు విస్తరణను సరిపెట్టినా.. అరకునే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారా..? పార్వతీపురాన్ని కేంద్రంగా మారుస్తారా అన్న ప్రతిపాదనలు నలుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి ప్రతిపాదనలే పరిగణనలోకి తీసుకుంటే.. దూరాభారం నుంచి 'పాలకొండ' బయట పడినట్లే.ఏది ఏమైనా పూర్తిగా సమాచారం వచ్చేవరకు సందిగ్దమే!!