కాబూల్: అఫ్గాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఘజ్ని ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. '83 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం ఘజ్ని ప్రావిన్స్‌లోని సడో ఖేల్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు' అని ఘజ్ని గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి అరిఫ్ నూరి తెలిపారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఈ విమానం కూలినట్లు తెలుస్తోంది.ఏదైనా సాంకేతిక లోపం వల్ల విమానం కూలిందా లేదా తాలిబన్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారా అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. విమానం కూలిన ప్రదేశానికి ప్రత్యేక బలగాలను పంపించినట్లు అధికారులు తెలిపారు. తొలుత కూలిన విమానం అఫ్గాన్‌కు చెందిన అరియానా ఎయిర్‌లైన్స్‌గా వార్తలు వచ్చాయి. కానీ సదరు ఎయిర్‌లైన్స్ ఆ వార్తలను ఖండించింది. తమ విమనాలన్నీ బాగానే ఉన్నాయని, దేనికీ ప్రమాదం జరగలేదని తెలిపాయి. ప్రమాదానికి గురైన విమానం జోర్దాన్‌కు చెందినదిగా భావిస్తున్నారు.
ఘోర విమాన ప్రమాదం