ప్రతి గింజా కొనుగోలు చేస్తాం -సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు

శ్రీకాకుళం : జనవరి 3 : జిల్లాలోని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే, రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు స్పష్టం చేసారు. అంతేకాకుండా  రైతుల నుండి కొనుగోలు  చేసిన ధాన్యానికి సంబంధించి 48 గంటల్లోగా చెల్లింపులు చేయడం జరుగుతుందని, ఇందులో ఎటువంటి అపోహలకు తావివ్వరాదని జె.సి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డయల్ యువర్ జె.సి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జె.సి స్వయంగా నిర్వహించి ఫోన్ కాలర్స్ లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేసారు. రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని, కళ్లాల వద్దకే పి.పి.సిలు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని అన్నారు. రైతులు స్వంత ఖర్చులతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు తక్షణమే రవాణా ఛార్జీలను చెల్లించడం జరుగుతుందన్నారు. ధాన్యాన్ని వేసేందుకు అవసరమైన గోనెసంచులను కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పారు. ధాన్యంలో తేమ శాతాన్ని అనసరించి చెల్లింపులు  చేస్తారని చెప్పారు. జిల్లాలోని రైతుల వద్ద నుండి కాకుండా ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటివారిపై చర్యలు తీసుకుంటామని జె.సి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ఎ.కృష్ణారావు, పౌర సరఫరాల శాఖ అధికారి జి.నాగేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.