శ్రీకాకుళం : జనవరి 20: గ్రామ సచివాలయాల పని తీరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ వివిధ అభివృధ్ధి పనులపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు సత్వర పాలన అందించడానికి గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రత్యేక అధికారులంతా సచివాలయాలు సక్రమంగా నిర్వహించే విధంగా పని చేయాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల వివరాలను, లబ్దిదారుల జాబితాలను సచివాలయాలలో పోస్టర్లలో ముద్రించి ప్రజలందరికీ తెలిసే విధంగా వుంచాలన్నారు. ముందుగా పింఛనులు, రేషన్ కార్డులు, గృహాలు తదితర లబ్దిదారుల జాబితాలను సంబంధిత మండల అభివృధ్ధి అధికారులు పక్కాగా పరిశీలన చేయాలన్నారు. సచివాలయాలలో టేబుళ్ళు, కుర్చీలు, బీరువాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్, ల్యాప్ టాప్ లు కూడా అందుబాటులో వుండాలన్నారు. సచివాలయాలలోని ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించాలని, గార్హాజరైన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. హాస్టళ్ళలోని మరమ్మత్తు పనులను పర్యవేక్షణ చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిబంధనలననుసరించి పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలించాలని తెలిపారు. మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ వివరించారు. నోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించి, అభివృధ్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
గ్రామ సచివాలయాల పర్యవేక్షణ అవసరం : జిల్లా కలెక్టర్