రైల్వే శాఖ పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని డబల్ డెకర్ సర్వీస్ లు

విజయవాడ : సంక్రాంతి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ డబుల్‌ డెకర్‌ల వైపు చూస్తోంది. డబుల్‌ డెకర్‌ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్‌ల మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఈ రద్దీని నివారించటానికి ప్రత్యేక రైళ్లను వేయటానికి రైల్వే శాఖకు తలకు మించి భారమౌతోంది. దీంతో స్పెషల్‌ రైళ్లుగా డబుల్‌ డెకర్‌లను రంగంలోకి దింపితే రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తోంది. విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్‌ల మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.ఈ రైళ్లలో నాలుగు డబుల్‌ డెకర్‌ రైళ్లు ఉండటం విశేషం. సంక్రాంతి పండుగ రద్దీని నివారించటానికి పక్షం రోజుల ముందు నుంచే ప్రతి రోజూ రైల్వే స్పెషల్స్‌ నడపాల్సి వస్తోంది. ఈ క్రమంలో ముఖ్యంగా విజయవాడ మీదుగా అటు విశాఖ, ఇటు సికింద్రాబాద్‌ల మార్గంలో రైళ్లు పోటెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డబుల్‌ డెకర్‌ శ్రేణిలో నడిపే నాలుగు ప్రత్యేక రైళ్లు ట్రైన్‌ నెంబర్‌ 08525గా ఈ నెల 12, 19 తేదీలలో విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలు దేరతాయి. ఇవి విజయవాడ వచ్చేసరికి ఉదయం 11.15 గంటలు అవుతుంది. ఈ రైళ్లు విజయవాడ నుంచి సాయంత్రం 5.30 గంటలకు సికింద్రాబాద్‌ బయలుదేరతాయి.ఈ రైళ్లు విశాఖపట్నం నుంచి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్లలో ఆగుతాయి. ఇక సాధారణ రైళ్ల విషయానికి వస్తే ట్రైన్‌ నెంబర్‌ 08523 ఈ నెల 12, 19 తేదీలలో విశాఖపట్నం నుంచి ఉదయం 3.30 గంటలకు బయలుదేరతాయి. సికింద్రాబాద్‌కు అదే రోజున సాయంత్రం 4.50 గంటలకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 13, 20 తేదీలలో ఉదయం 4.35కు బయలుదేరి విశాఖపట్నంకు అదే రోజు సాయంత్రం 4.50 గంటలకు చేరుకుంటాయి. ఈ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో హాల్ట్‌ కల్పిస్తారు.